విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి

AP Governament Cancelled Bauxite Mining Leases In Visakhapatnam - Sakshi

1,521.078 హెక్టార్లలో ఆరు మైనింగ్‌ లీజుల రద్దు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

విశ్వసనీయతను చాటుకున్నారని గిరిజన ప్రజాప్రతినిధుల ప్రశంసలు

సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు పూర్తిగా స్వస్తి పలకాలని వైఎస్‌ జగన్‌ సర్కారు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గిరిజనుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో 1521.078 హెక్టార్లకు సంబంధించిన ఆరు బాక్సైట్‌ మైనింగ్‌ లీజులను రద్దు చేస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్‌ గురువారం జీఓ నంబరు 80 నుంచి 85 వరకు వేర్వేరుగా ఆరు జీఓలు జారీ చేశారు. మన ప్రభుత్వం రాగానే గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని, వారి అభిప్రాయాల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి చెబుతూ మైనింగ్‌ లీజులను రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కాగానే అందుకు సంబంధించిన ఫైళ్లు తెప్పించుకుని పరిశీలించారు. బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి చెబితే సర్కారు ఆదాయం కోల్పోతుందని కొందరు ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు సూచించినా అంగీకరించలేదు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదని, గిరిజనుల  విశ్వాసాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందులో మరో మాటకు తావు లేదని, బాక్సైట్‌ మైనింగ్‌ లీజులు రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. తమ దశాబ్దాల కల, కోరికను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ చిరకాలం గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, గిరిజన ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.

రద్దయిన మైనింగ్‌ లీజులు
►విశాఖ జిల్లా జెర్రెల అభయారణ్యం రెండు, ఎనిమిది బ్లాకుల్లో 617 హెక్టార్లు.
►జెర్రెల అభయారణ్యం మూడో బ్లాకులో 460 హెక్టార్లు.
►జెర్రెల అభయారణ్యం ఒకటో బ్లాకులో 85 హెక్టార్లు.
►విశాఖటపట్నం జిల్లా అరకు మండలం చిట్టంగోలి అభయారణ్యంలో 152 హెక్టార్లు.
►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం (ఫారెస్టు బ్లాకు) రక్త కొండ గ్రామంలో 113.192 హెక్టార్లు.
►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం గాలికొండ రిజర్వు ఫారెస్టులో 93.886 హెక్టార్లు.

మాట తప్పిన బాబు..
విశాఖపట్నం జిల్లాలో 1521.078 హెక్టార్ల బాక్సైట్‌ నిక్షేపాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించింది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే గిరిజనుల కోరిక మేరకు బాక్సైట్‌ మైనింగ్‌ లీజులు రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి రాగానే అందుకు విరుద్దంగా కేంద్రం నుంచి అనుమతులు తెప్పించి 2015 నవంబర్‌ 5న తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top