బోగస్‌ ఓట్లకు బీఎల్వోలు సై

AP Election Commission Chittoor Fake Voters - Sakshi

బోగస్‌ ఓట్లను టీడీపీ నేతలు అధికార బలంతో ఓటరు జాబితాలో చేర్చారు.  తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలో 14 నియోజకవర్గాల్లో కోకొల్లలుగా బోగస్‌ ఓట్లు దర్శనమిచ్చాయి. దీనిపై ‘సాక్షి’ ఫోకస్‌ కథనం.

చిత్తూరు కలెక్టరేట్‌ : అధికార తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో బీఎల్వోలను లోబర్చుకుని ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లను సృష్టించింది. ఓటర్ల పేర్లలో చిన్న చిన్న మార్పులు చేసి నకిలీ ఓట్లను జాబితాలో చేర్చేలా కుట్ర పన్నింది. అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అడ్డదారి ప్రయత్నాలు విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలి. అయితే ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను వేయించేం దుకు కుట్ర చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలో లేని ఓట్లను, ఒక్కొక్కరికి రెండు, మూడు చొప్పున సృష్టించారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాను పరిశీలించగా సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర నాథరెడ్డి ప్రాతినిధ్యం వహించే రెండు నియోజకవర్గాలలో అధిక శాతం బోగస్‌ ఓట్లు దర్శనమిచ్చాయి. తుది ఓటర్ల జాబితా ప్రకారం సాక్షి  క్షేత్ర స్థాయిలో పరిశీలించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.
 
తప్పెవరిది...
గతంలో తయారు చేసిన ఓటర్ల సవరణ జాబితాలో అనేక బోగస్‌ ఓట్లు తలెత్తిన విషయాన్ని వాస్ట్‌ సంస్థ గుర్తించింది. ఈ తప్పుల తడకపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే బోగస్‌ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం స్వయంగా కలెక్టర్‌ ప్రద్యుమ్న క్షేత్రస్థాయిలో ముమ్మర పరిశీలనలు, తనిఖీలు చేపట్టారు.

ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చారు. తర్వాత 13,852 అనుమానిత ఓట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రక్రియలో అలసత్వం వహిం చిన ఏఈఆర్వో(తహసీల్దార్‌), ఈఆర్వో, బీఎల్వో, కంప్యూటర్‌ ఆపరేటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టాక తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలోనూ అనేకంగా బోగస్‌ ఓట్లు దర్శనమిచ్చాయి. ఎన్నికల ఓటర్ల ప్రక్రియ పరిశీలకుడు శ్రీనివాస్‌శ్రీనరేశ్‌ మూడుసార్లు జిల్లాలో పర్యటిం చారు. 66 మంది ఏఈఆర్వోలు, 14 మంది ఈఆర్వోలు, జాయింట్‌ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌ ముసాయిదా జాబి తాను తయారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఇంత మంది చేసిన కసరత్తులో తప్పులు తలెత్తడం విమర్శలకు తావిస్తోంది.

తయారవ్వని పారదర్శకమైన ఓటర్ల జాబితా..
తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితాలో బోగస్‌ ఓట్లు దర్శనమివ్వడంతో జిల్లా యంత్రాంగం పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రద్యుమ్న తీవ్రంగా చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే బీఎల్వోలు టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారు ఉండడంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి.

బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓటర్లుగా దరఖాస్తు చేసిన వారినందరిని ఆమోదించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఏఈఆర్వోలు, ఈఆర్వోలు తూతూ మంత్రంగా విధులు నిర్వహించారు. దీంతోనే తుది ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లు ఎక్కువగా దర్శనమిచ్చాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో తలెత్తిన బోగస్‌ ఓట్లను తొలగించి, పారదర్శకమైన ఓటర్ల జాబితాను ప్రకటించాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top