‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Launches Rythu Bharosa Scheme - Sakshi

రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి

పెట్టుబడి సాయంగా ఏటా రూ. 13500

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

రైతు భరోసాతో కష్టాలు తీరాయి: రైతులు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన సీఎం జగన్

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు.

రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని సీఎం అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా.. రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు.

నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌
‘గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ అవుతాయి. ఏప్రిల్‌లో 2వేలు ఇచ్చాం.. ఇప్పుడు రూ.5500 ఇస్తున్నాం. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తాం. అక్టోబర్‌లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తాం. రైతు భరోసా కింద మొత్తం రూ.13,500 రైతులకు అందిస్తాం. పార్టీలకతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నాం. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించాం. రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చు’ అని తెలిపారు. 

రైతుల ఖాతాల్లో రూ.2,800 కోట్లు జమ
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం.

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..
రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్‌బీకే ద్వారా అందిస్తాం. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తాం. రైతు భరోసా కేంద్రంలో 3 రకాల ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తెస్తాం. జిల్లా, నియోజకవర్గ, రైతు భరోసా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి. ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్‌బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి. వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రైతులకు నష్టం లేకుండా కౌలు చట్టాన్ని తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని కూడా ఇదివరకే ప్రారంభించాం.

మా కష్టాలు తీరాయి: రైతులు
సీఎం జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. ‘వైఎస్ఆర్ ఎప్పుడూ రైతుల కోసమే తపించే వారు. రైతుల కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు. గతంలో పెట్టుబడి సాయంలేక అప్పులు చేసేవాళ్లం. ఇప్పుడు రైతు భరోసాతో మా కష్టాలు తీరాయి. అమ్మ ఒడి ద్వారా మా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. పేదల కోసం ఇన్ని పథకాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు. కరోనా సమయంలో కూడా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. పంటలు దళారుల పాలు కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలతో మాకు ఎంతో మేలు చేస్తాయి’ అని రైతులు  ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top