ఎస్‌ఈసీ అంశంపై సుప్రీంకు వెళ్తున్నాం: ఏపీ ఏజీ

Andhra Pradesh Advocate General Sriram Comments On Nimmagadda Ramesh - Sakshi

ఎస్ఈ‌సీ  వివాదంపై అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటించుకున్నారని.. హైకోర్టు తీర్పును అనుసరించి ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 

‘నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యులర్ విడుదల చేసి హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. ఎస్‌ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ..హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. నిమ్మగడ్డ మాత్రం తనంతట తానే .. బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యులర్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం. 

రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నియామకం కూడా చెల్లదు.

హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. 2 నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్‌ఈసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ప్రభాకర్‌ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశించారు. ఈ విషయం ప్రభాకర్‌ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు.

తాజా తీర్పుపై స్టే ఇవ్వాలని ఇప్పటికే  ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఎస్‌ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధం. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. కానీ ఇది రాజ్యాంగ అంశాలు... హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్వీయ ప్రకటితం చేసుకోవడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి చెప్పాను. ఎవరిని ఎస్‌ఈసీగా నియమించాలనే విషయంలో...  రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేదని హైకోర్టు చెప్పింది.  అదే విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంలోనూ వర్తిస్తుంది’ అని శ్రీరామ్‌ అన్నారు.
(చదవండి: ఎన్నికల కమిషనర్‌ ‘ఆర్డినెన్స్‌’ రద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top