
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) కనగరాజ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ప్రస్తుతం అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 16 కల్లా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్‌లను ఆదేశించింది.
17వ తేదీ నాటికి ప్రతివాదుల కౌంటర్లకు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడు వ్యాజ్యాలు దాఖలు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్, జీఓను జారీచేసింది. ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‌ను నియమిస్తూ కూడా ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాలు చేస్తూ నిమ్మగడ్డతో పాటు పలువురు టీడీపీ, బీజేపీ నేతలు, మరికొందరు మొత్తం ఏడు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. నిమ్మగడ్డ తరఫున డీవీ సీతారామమూర్తి, ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్‌లు హాజరయ్యారు.