ఉపనయనానికి రూ.15,000 ఆర్థిక సాయం

Andhra Pradesh Brahmin Welfare Corporation Help to Odugu - Sakshi

పేద బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా నూతన పథకం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు కసరత్తు

సాక్షి, అమరావతి: పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 7–16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు)

మరోవైపు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకంలో భాగంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు కార్పొరేషన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు. కనీసం ఏడాది కాలం మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయని, 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ త్వరలో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: మీ చర్యలు స్ఫూర్తిదాయకం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top