
'బాబు... మోసం, దగా చేయబోతున్నారు'
తక్షణమే రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హమీ ప్రకారం తక్షణమే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం రైతులను మోసం, దగా చేయబోతున్నారని ఆరోపించారు.
మంగళవారం హైదరాబాద్లో రైతుల రుణమాఫీపై చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరీపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రుణమాఫీ అంటే అర్థం రీషెడ్యూల్ చేయడమా అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా రీషెడ్యూల్ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై ఇంతకన్నా దౌర్బాగ్యం మరొకటి లేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.