
విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి
రాజకీయ కక్షతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు..
హైదరాబాద్: రాజకీయ కక్షతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దురద్దేశంతో వైఎస్ఆర్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని చెప్పారు.
ఎన్టీఆర్ను విగ్రహాంగా మార్చింది చంద్రబాబు కాదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు కొన్ని ఛానల్స్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని అంబటి ఖండించారు. కాగా, వైఎస్ఆర్సీపీ మానవతా దృక్పథంతోనే పోటీ చేయడం లేదని అంబటి స్పష్టం చేశారు.