అంగన్‌వాడీలపై అధికార అజమాయిషీ

ALM SC Monitoring Committee on Anganwadi - Sakshi

ప్రతి కేంద్రానికి ఒక కమిటీ

పనితీరుపై ప్రతి నెలా నివేదిక

ఉత్తర్వులు జారీ చేసిన స్త్రీ శిశు సంక్షేమశాఖ

పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు కసరత్తు

ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకే అంటున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలపై రాజకీయంగా పెత్తనం చెలాయించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రాల వారీగా అజమాయిషీ, నిఘా పెంచేందుకు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఓ పథకం రూపొందించడమే దీనికి కారణం. ఇందులో భాగంగా ఏఎల్‌ఎమ్‌ ఎస్‌సీ (అంగన్‌వాడీ స్థాయి మానిటరింగ్, మద్దతు కమిటీలను) వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 11వ తేదీన  సర్కులర్‌ నెంబర్‌ 16028–25.ఎస్‌ఎన్‌పీ జీఓను జారీ చేసింది. దీని ప్రకారం  కమిటీలు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలు మరో జన్మభూమి కమిటీల్లా మారతాయన్న వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం, యద్దనపూడి: అంగన్‌ వాడీ పర్యవేక్షక కమిటీలు ప్రతి నెలా సమావేశమై  అక్కడ చర్చించిన అంశాలు, తీర్మానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుంది. అలాగే కార్యకర్తలకు, ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని సదరు కమిటీ ఇచ్చే నివేదికతో ముడిపెట్టారు. ఒకవేళ కమిటీలు అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు బాగలేదని నివేదికను పంపిస్తే వారిని ఇంటికి సాగనంపేందుకు ఒక ప్రణాళిక రూపొందించింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ మాటవినని వారిని తొలగించి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేందుకే ప్రభుత్వం ఉదేశ్య పూర్వంగా ఈ విధంగా చేస్తోందని అంగన్‌వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్‌ వంటి వాటితో ఇప్పటికే అంగన్‌వాడీల పనిని సమీక్షిస్తున్నారని, మళ్లీ  కొత్తగా ఈ పర్యవేక్షణ కమిటీల అవరమేమిటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కేంద్రాల పర్యవేక్షణకు సూపర్‌వైజర్ల కొరత ఉండటంతో సిబ్బంది సేవలు పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ఐసీడీఎస్‌ అధికారులు చెప్తున్నారు.

నియామక పక్రియకు కసరత్తు...
జిల్లాలో 21 అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌లున్నాయి. వాటి పరిధిలో 4009 అంగన్‌వాడీ కేంద్రాలు,  మరో 235 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు 1,81,270 మంది చిన్నారులు, గర్భవతులు 20,772, బాలింతలు 25,178  మందికి ఈ కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. కేంద్రాలపై పెత్తనం చెలాయించేందుకు గానూ అంగన్‌వాడీ స్థాయి మానిటరింగ్‌ మద్దతు కమిటీల నియామక పక్రియలు పూర్తిచేయటానికి అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. ఈ కమిటీలో మెత్తం తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలో పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్‌పర్సన్‌గా, అంగన్‌వాడీ కార్యకర్త కన్వీనర్‌గా, మహిళా మండలి నుంచి ఇద్దరు, ఆశ సిబ్బంది ఒకరు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ నుంచి ఇద్దరు, స్థానికంగా రిటైర్డ్‌ ఉద్యోగుల ముగ్గురు ఇలా అందరిని కలిపి కమిటీలను వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలు ప్రతినెలా కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించింది.  

వ్యతిరేకిస్తున్న అంగన్‌వాడీలు...
రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకే ప్రయత్నిస్తోందని, కేంద్రాలపై పెత్తనం చెలాయించేందుకు కమిటీలను నియమించటం అందులో భాగమేనని అంటున్నారు. ముఖ్యంగా ఈ కమిటీల వల్ల రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటంతో పాటు అంగన్‌వాడీలపై వేధింపులు పెరుగుతాయని వాపోతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మథర్స్‌ కమిటీలను వేసినప్పుడు అవి అంగన్‌వాడీ సిబ్బందిపై లేనిపోని ఆరోపణలు గుప్పించి క్రమశిక్షణ చర్యల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. అప్పుడు అంగన్‌వాడీ సిబ్బంది వ్యతిరేకించటంతో చంద్రబాబు రద్దుచేశారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకునేందుకు ఇలాంటి కమిటీలను నియమించి ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయకుట్రలో భాగమే...
తమ మాట వినని వారిని తొలగించి తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులున్నారు. కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు బయోమెట్రిక్, ప్రత్యేకమైన యాప్‌లు ద్వారా తెలుసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు పర్యవేక్షణ కమిటీలను వేయటం రాజకీయ దురుద్ధేశమే.
ఈదర అన్నపూర్ణ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top