
అద్దెల దరువు
నగరంలో అద్దె ఇళ్లంటేనే బాబోయ్.. అంటున్నారు. ఇళ్ల యజ మానులు బాడుగలను భారీగా పెంచేసి అద్దెదారుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
విజయవాడ : నగరంలో అద్దె ఇళ్లంటేనే బాబోయ్.. అంటున్నారు. ఇళ్ల యజ మానులు బాడుగలను భారీగా పెంచేసి అద్దెదారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు సంపాదనలో సగం అద్దెలకే సమర్పించుకుంటున్నారు. కొన్నిచోట్ల అద్దె ఇళ్ల కోసం కొత్తగా బ్రోకర్ కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు కూడా వెలుస్తున్నాయి.
చిన్నపాటి ప్రరువేటు ఉద్యోగం చేసుకుంటున్న అజయ్ రెండేళ్లుగా లబ్బీ పేటలోని అద్దె ఇంట్లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. రాజధాని ప్రకటన అనంతరం ఇంటి యజమాని అద్దెను రూ.5వేల నుంచి రూ.7వేలకు పెంచేశాడు. చేసేదేమీలేక అజయ్ ఇల్లు ఖాళీచేసి మురికివాడలో ఓ చిన్న ఇంట్లోకి మారిపోయూడు.
కృష్ణలంకలోని ఓ అద్దె ఇంట్లో పదేళ్లుగా ఉంటున్న ఆర్.వెంకటేశ్వరరావును వెంటనే ఖాళీ చేయూలని యజమాని హకుం జారీచేశాడు. వెంకటేశ్వరరావు కుదరదని చెప్పడంతో తన కుమారుడి పెళ్లి పనులున్నాయని, ఇల్లు అవసరమని చెప్పడంతో ఖాళీ చేశాడు. ఇంటి అద్దె రెట్టింపు చేసి వేరొకరికి ఇవ్వడానికే యజమాని అలా చెప్పాడని తెలుసుకుని వెంకటేశ్వరరావు కంగుతిన్నాడు.
నగరంలో ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటున్న వారి పరిస్థితి ఇదీ. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల మాదిరిగా ఇక్కడ ఇల్లు దొరకడమే గగనమైతే.. దొరికిన ఇల్లు రాజధాని ప్రకటన నేపథ్యంలో యజమానులు పెట్టే ఆంక్షలు, ఖాళీ చేయించి వేరొకరికి ఎక్కువ అద్దెకు ఇవ్వడానికి చెప్పే అబద్ధాలు మరో విశేషం. ఫలితంగా సొంత ఇల్లు లేనివారు అనేక అవస్థలు పడుతున్నారు.
బ్యాచిలర్స్ గదులకు డిమాండ్
విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో శిక్షణ కోసం వచ్చే బ్యాచిలర్స్ గదులకు డిమాండ్ పెరిగింది. ఇంటి యజమానులు తమ ప్లాట్లను గదులుగా మార్చి ఒక్కో బ్యాచిలర్‌కు నెలకు రూ.2 వేలకు అద్దెకు ఇస్తున్నారు. ఆ గదినే మరో నలుగురికి కేటాయించి ఒక్కొక్కరి వద్ద రూ.2వేలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావంతో సామాన్య, మధ్య తరగతికి చెందిన అనేక కుటుంబాలు అద్దె ఇళ్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెరుగుతున్న జనాభా.. సరిపోని ఇళ్లు..
2011 లెక్కల ప్రకారం.. నగరంలో 10.35 లక్షల జనాభా ఉండగా, మరో రెండు లక్షల మంది రోజూ వివిధ పట్టణాల నుంచి వచ్చిపోతుంటారు. మునిసిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం.. నగరంలో 2.11 లక్షల ఇళ్లు ఉన్నాయి. కాలువ గ ట్లు, మురికివాడల్లో మరో లక్ష. వీటిలో సుమారు నాలుగైదు లక్షల కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఇక.. విద్య, వ్యాపారపరంగా తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలు, పల్లెల నుంచి వచ్చిన లక్షలాది మంది నగరంలో తలదాచుకుంటున్నారు. ఈ జనాభాకు అనుగుణంగా ఇళ్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు.
బందర్‌రోడ్డులో బంజారాహిల్స్ రెంట్
నగరంలో ఇంటి అద్దెలు ఏరియాలను బట్టి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మాదిరిగా బెంజిసర్కిల్, పటమటలో అద్దెల మోత మోగుతోంది. విద్యాసంస్థలు అధికంగా ఉన్న లబ్బీపేట, మొగల్రాజపురం, ఐదో నంబర్‌రోడ్డు, ఏలూరురోడ్డులో అధిక అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రిపుల్ బెడ్‌రూమ్ అద్దె రూ.14వేల నుంచి రూ.20వేల వరకు ఉంది. డబల్ బెడ్‌రూమ్ రూ.12వేల పైమాటే. ఇక.. కృష్ణలంక, భవానీపురం, చిట్టినగర్, గాంధీనగర్‌లో మూడు గదులున్న పోర్షన్ రూ.6వేల నుంచి రూ.10వేలు. కొండ ప్రాంతాల్లో సింగిల్‌రూమ్‌కు రూ.1,500, డబల్ రూమ్‌కు రూ.3వేలు తీసుకుంటున్నారు. కాలువగట్టు ప్రాంతాలు, మురికివాడల్లోని పూరిళ్లలోగదికి వెయ్యి రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్ తరహాలో మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయడం కొసమెరుపు.
అడ్డగోలు నిబంధనలతో అద్దెదారుల బెంబేలు
ఒక కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కొందరు యజమానులు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. వీటన్నింటికీ ఓకే అంటే.. రెండు నెలల అద్దె అడ్వాన్స్‌గా ఇవ్వాలి. అన్నింటికీ ఒప్పుకొని ఇంట్లో దిగితే సంవత్సరానికే ఏదో సాకు చెప్పి ఖాళీ చేయిస్తున్నారు. ఏడాదికి 20శాతం కంటే ఎక్కువ అద్దె పెంచే అవకాశం లేకపోవడంతో.. ఉన్నవారిని ఎలాగైనా ఖాళీ చేయించి, కొత్తవారికి ఎక్కువ అద్దెకు ఇచ్చేందుకు యజమానులు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం కుంటిసాకులు చెప్పడానికి సైతం వెనకాడట్లేదు. ఫలితంగా అద్దెదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు యజమానులు పెట్టే నిబంధనలకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.