జీఓ 317 వల్ల నష్టపోయిన వారికి డిప్యుటేషన్లు ఇచ్చే పరిస్థితి లేదంటున్న సొసైటీలు
కొత్త నియామకాలు, బదిలీల వల్ల ఖాళీలు లేవంటున్న ఉన్నతాధికారులు
సొంత జిల్లాల్లో డిప్యుటేషన్ వస్తుందనుకున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ
త్వరలో ఆందోళన బాట.. ఒకట్రెండు రోజుల్లో మంత్రులకు ఫిర్యాదు చేసే యోచన
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. డిప్యుటేషన్ పద్ధతిలో గరిష్టంగా మూడేళ్లపాటు నష్టపోయిన ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నాయి. కానీ గురుకుల విద్యాసొసైటీల్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. గిరిజన గురుకుల సొసైటీ దరఖాస్తులు స్వీకరించి ఈ ప్రక్రియను అటకెక్కించగా ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలు మాత్రం కనీసం దరఖాస్తులు సైతం స్వీకరించలేదు. ఖాళీలు లేవనే సాకుతో ఈ ప్రక్రియను ప్రారంభించకుండా చేతులెత్తేశాయి. సొసైటీల వైఖరిపై గురుకుల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ అంశంపై గురుకుల ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సంక్షేమ శాఖల కార్యదర్శులకు ఫిర్యాదు చేశాయి.
నాలుగున్నర వేల మంది...
రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజన చేపట్టింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు చేసినప్పటికీ అందులో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానికులైనా కొందరిని ఇతర ప్రాంతాలకు కేటాయించింది. దీనివల్ల ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సుమారు 4,500 మంది టీచర్లు, బోధనేతర సిబ్బంది నష్టపోయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. జీఓ 317 ద్వారా అన్యాయం జరిగినందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరగడంతో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 317 బాధితులకు ఉపశమన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తిరిగి కేటాయింపులు చేసే బదులు వారిని సొంత ప్రాంతంలో డిప్యుటేషన్‌పై పంపేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖలు బాధిత ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాయి.
కానీ గురుకుల సొసైటీల్లో గిరిజన గురుకుల సొసైటీ మాత్రమే దరఖాస్తులు స్వీకరించగా... ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలు దరఖాస్తుల ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం ఇతర ప్రభుత్వ శాఖలు డిప్యుటేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. కానీ గురుకుల సొసైటీల్లో కదలిక లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖాళీల లభ్యత లేనందునే ఈ ప్రక్రియ చేపట్టలేదని గురుకుల సొసైటీలు చెబుతున్నాయి. నూతన నియామకాలు, బదిలీల ప్రక్రియతో చాలాచోట్ల గురుకుల పాఠశాలల్లో ఖాళీలు భర్తీ అయ్యాయని... ఈ పరిస్థితుల్లో దరఖాస్తులు స్వీకరించినా ప్రయోజనం ఉండదనే భావన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు సొసైటీల ఉద్యోగులు ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు... ఒకట్రెండు రోజుల్లో మంత్రులకు ఫిర్యాదులు చేసి ఆపై ఆందోళనబాట పట్టనున్నారు.


