తొలిరోజు నిబంధనలకు తూట్లు

Alcohol Sales in Closed Wine Shop in Dwaraka Thirumala - Sakshi

ద్వారకాతిరుమలలో మద్యం దుకాణం వద్ద కూల్‌డ్రింక్స్, స్నాక్స్‌ విక్రయాలు

దర్జాగా ఫ్రిజ్‌ల ఏర్పాటు

ద్వారకాతిరుమల: మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆశయాలకు స్థానిక ఎక్సైజ్‌ శాఖ అధికారులు, గత సిండికేట్లతో కుమ్మకై ఆదిలోనే తూట్లుపొడుస్తున్నారు. ద్వారకాతిరుమలలో మంగళవారం ప్రారంభమైన ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహణ చూస్తే స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం మద్యం అమ్మకాల బాధ్యత పూర్తిగా సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లదే. అదేవిధంగా ప్రభుత్వ నియమ, నిబంధనల అమలు తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక ఎక్సైజ్‌ శాఖ అధికారులది. దుకాణంలో బీరు బాటిల్స్‌ను కూలింగ్‌ లేకుండా విక్రయించాలి. దుకాణం వద్ద గానీ, పరిసరాల్లో గానీ కూల్‌డ్రింక్స్, వాటర్‌ బాటిల్స్, షోడాలు, స్నాక్స్‌ వంటివి అమ్మకూడదు. చివరకు మందు బాబులు దుకాణం వద్ద తాగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులదే. ఇక్కడ దుకాణం ప్రారంభించిన తొలిరోజే ఆ నిబంధనలన్నీ అటకెక్కాయి. దర్జాగా దుకాణం వెనుక రెండు ఫ్రిజ్‌లు, వాటర్‌ బాటిల్స్, కూల్‌ డ్రింక్స్, సోడాలు, స్నాక్స్‌ వంటివి దర్శనమిచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణం వెనుక వీటి విక్రయాలు జోరుగా సాగాయి. ఈ విషయం బయటకు పొక్కే సరికి రేకులు, టార్పాలిన్‌లు కప్పి దాచే ప్రయత్నం చేశారు. 

సిండికేట్ల ఒత్తిడితోనే..
కొత్త మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించి, మద్యం దుకాణాల ఏర్పాటును పూర్తిగా కుదించి, నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ ఆశయాలను సక్రమంగా అమలు చేసేందుకు స్థానిక ఎక్సైజ్‌ శాఖ అధికారుల నిఘా నిరంతరం దుకాణాలపై ఉండాలి. అయితే కంచే చేను మేసిన చందాన ఇక్కడి అధికారులు గత సిండికేట్ల ఒత్తిడికి తలొగ్గారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకాతిరుమలలో క్షేత్ర పవిత్రత దృష్ట్యా, గతానికి భిన్నంగా మద్యం దుకాణాన్ని గ్రామ శివారులో ఏర్పాటు చేశారు. ఆ దుకాణం వెనుకే కూల్‌ డ్రింక్స్, సోడాలు, ఇతర తినుబండారాల అమ్మకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని విక్రయించింది దుకాణంలోని కొత్త సేల్స్‌మేన్‌లా.? లేక గత సిండికేట్‌దారుల అనుచరులా.? అన్నది స్థానిక ఎక్సైజ్‌ శాఖ అధికారులే చెప్పాలి. ద్వారకాతిరుమలలో మద్యం దుకాణం ప్రారంభించిన తరువాత మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉన్నానని భీమడోలు ఎక్సైజ్‌ ఎస్సై శ్రీనివాస్‌బాబు వివరణ ఇచ్చారు. దుకాణం వద్ద కూల్‌ డ్రింక్స్, స్నాక్స్‌ వంటివి ఏవీ విక్రయించలేదని తెలిపారు. దుకాణం వెనుక ఫ్రిజ్‌లు పెట్టిన విషయం తన దృష్టికి రాలేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top