
నిర్లక్ష్యం
ఒంగోలు సెంట్రల్ రిమ్స్ ఎ.ఆర్.టి. (యాంటీ రిట్రో వైరల్ థెరపీ) సెంటర్లో మందుల సరఫరా నిలిచిపోయింది.
నిలిచిపోయిన ఎయిడ్స్ మందు సరఫరా
రోగుల్లో భయాందోళన
ఎప్పుడు వస్తుందో తెలియదంటున్న రిమ్స్ డెరైక్టర్
ఒంగోలు సెంట్రల్ రిమ్స్ ఎ.ఆర్.టి. (యాంటీ రిట్రో వైరల్ థెరపీ) సెంటర్లో మందుల సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఓ రకం మందులు పూర్తిగా అయిపోవడంతో వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న పలువురు నగరంలోని ఎ.ఆర్.టి. సెంటర్‌కు వచ్చి మందుల తీసుకువెళుతుంటారు. ఈ మందులు క్రమపద్ధతిలో వాడితేనే ఫలితం ఉంటుంది. జిల్లాలోని చీరాల, మార్కాపురాల్లో ఏఆర్‌టీ సెంటర్లతోపాటు కందుకూరు, కనిగిరి, దర్శి, అద్దంకి, గిద్దలూరు తదితర ప్రాంతాలలో లింక్ ఎ.ఆర్.టి. సెంటర్లు రోగుల సౌకర్యం కోసం ఏర్పాటై సేవలందిస్తున్నాయి. రోగులు తమ ప్రాంతంలో మందులు తీసుకుంటే అందరికీ తెలుస్తుందని దూరాభారమైనా దాదాపుగా 6,500 మంది రోగులు ప్రతినెలా రిమ్స్‌కు వచ్చి మందులు తీసుకురావడానికి వచ్చీపోతుంటారు. వీరిలో దాదాపు 2,500 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడే యాంటీ రిట్రో వైరల్ మందులు ‘టినోలాంబ్, నెవరపిన్’ మాత్రలు నెల రోజులకు సరిపడా ఇవ్వాల్సి ఉండగా స్టాకు లేకపోవడంతో గత వారం రోజుల నుంచి చేతులెత్తేస్తున్నారు. కనీసం మందులు ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పకపోవడంతో రోగులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టినోలాంబ్ అనే మాత్రలు నెలకు సరిపడా కొనాలంటే బయట మార్కెట్‌లో రూ.1,400 ధర ఉంది.
ఎప్పుడు వస్తాయో తెలియదు..
- డాక్టర్ అంజయ్య, రిమ్స్ డెరైక్టర్
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడే రెండోరకం మందుల సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడు వస్తాయో కుడా తెలియదు.