
కొలంబియా దేశాధ్యక్షుడిపై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత.
కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్‌ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు.