ఇసుక ర్యాంపు ఏర్పాటు అడ్డగింత | Afunctional of Established sand ramp | Sakshi
Sakshi News home page

ఇసుక ర్యాంపు ఏర్పాటు అడ్డగింత

Nov 22 2014 4:29 AM | Updated on May 25 2018 9:17 PM

మండలంలోని మామిడివలస పంచాయతీ పరిధిలో ఉన్న కాఖండ్యాం గ్రామం వద్ద అక్రమ ఇసుకర్యాంపు ఏర్పాటును వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు.

బూర్జ : మండలంలోని మామిడివలస పంచాయతీ పరిధిలో ఉన్న కాఖండ్యాం గ్రామం వద్ద అక్రమ ఇసుకర్యాంపు ఏర్పాటును వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఈ ర్యాంపు నిర్మిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ ర్యాంపు వల్ల గ్రామానికి ముప్పు అని వారన్నారు. వరద వస్తే గ్రామం ముంపునకు గురవుతుందని భయాందోళన వ్యక్తం చేశారు.

నాగావళి నదీతీరంలో ఉన్న కాఖండ్యాం గ్రామం వద్ద గట్టు పూర్తి బలహీనంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ర్యాంపు ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టు బలహీనతపై గతంలో అనేక సార్లు ప్రజాప్రతినిధులను గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో గట్టుకు కోతవేసి ర్యాంపునకు అవసరమైన రహదారి నిర్మాణాన్ని యంత్రాలతో చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆనెపు రామకృష్ణ, సర్పంచ్ జగ్గుపల్లి సూర్యనారాయణ, ఎంపీటీసీ ప్రతినిధి కొబగాన వేణుగోపాల్ గ్రామస్తులతో కలసి పనులను అడ్డుకున్నారు.

ర్యాంపువద్ద బైఠాయించి నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఆర్‌డీఏ పీడీ తనూజరాణికి ఫోన్లో ఫిర్యాదు చేయగా ఆమె స్పందించి సంఘటనా స్థలానికి ప్రాంతీయ సమన్వయకర్త ధనుంజయరావును పంపించారు. ర్యాంపు ఏర్పాటు చే స్తే కాఖండ్యాంతో పాటు మరో 10 గ్రామాలు జలమయమైపోతాయని ఆందోళన కారులు ఆయనకు వివరించారు. అలాగే వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ధనుంజయరావు మాట్లాడుతూ కాఖండ్యాం, అల్లెన గ్రామాల వద్ద ఇసుక ర్యాంపులను మంజూరు చేశాం తప్ప ప్రారంభించలేదని, ఈ నెల 23వ తేదీన ప్రభుత్వవిప్ రవికుమార్‌తో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు మండలంలో పాలవలస గ్రామానికి వచ్చిన జె.సి.వివేక్‌యాదవ్‌ను కలిసి సమస్యను వివరించారు. కాఖండ్యాంలో ర్యాంపు ఏర్పాటు వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. అదే సమయంలో పక్కనే ఉన్న తహశీల్దార్ ర్యాంపు ఏర్పాటు చేయకుండానే ఇసుక రవాణా చేసే ఏర్పాటు చేస్తామని సమస్యను పక్కదారి పట్టించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు ర్యాంపు కొనసాగితే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement