కార్మికుల బతుకులు ఆగం


చిట్యాల, న్యూస్‌లైన్: చిట్యాల శివారులోని ఐడీఈఎల్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజాము న జరిగిన ప్రమాదానికి రియాక్టర్లలో ఉష్ణోగ్రత పెరగడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పరిశ్రమలోని డైయింగ్ ప్లాంట్ యూనిట్‌లో పీఈటీఈఎన్(పెంటా ఎరిత్రాటాల్ ట్రై నైట్రేట్) అనే పేలుడు పదార్థం తయారవుతుంది. దీనిని డిటోనేటర్లలోని ఫ్యూజులో పేలుడు కోసం వాడతారు. ఈ పదార్థాన్ని ద్రవరూపం నుంచి ఘనరూపంలోకి రెండు రియాక్టర్ల ద్వారా మారుస్తారు. మార్చే సమయంలో రియాక్టర్లలో తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. కానీ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత దాటిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పేలుడు సంభవించినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు.

 పరిహారం చెల్లించాలని రాస్తారోకో

 ప్రమాదంలో మృతిచెందిన శ్రీను కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, వివిధ పార్టీల నాయకులు చిట్యాల-రామన్నపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. మృతుని కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నాయకు లు డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చేం దుకు పరిశ్రమ యజమాన్యం ఒప్పుకోవడంతో వారు ఆందోళన విరమించారు.

 పలువురి సందర్శన

 సంఘటనా స్థలాన్ని భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, ఫోరెన్సిక్ నిపుణురాలు శారద, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ డెరైక్టర్ శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూనె వెంకటస్వామి, టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, రేగెట్టె మల్లికార్జున్‌రెడ్డి, పాటి నర్సిరెడ్డి, గొదుమగడ్డ జలెందర్‌రెడ్డి, నారబోయిన శ్రీనివాస్, కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, చికిలంమెట్ల అశోక్, గోశిక వెంకటేశం తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top