
ఏసీబీ వలలో సర్వేయర్
మండల సర్వేయర్ బాలసుబ్బరాయుడు ఏసీబీ వలలో చిక్కాడు. ఓ రైతు నుంచి రూ. 5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
కొండాపురం : మండల సర్వేయర్ బాలసుబ్బరాయుడు ఏసీబీ వలలో చిక్కాడు. ఓ రైతు నుంచి రూ. 5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బి. కొట్టాలపల్లెకు చెందిన కంచిమిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే రైతు బెడుదూరు రెవెన్యూ పొలంలోని సర్వేనెంబర్ 305,308లో కొలతల కోసం 2013 అక్టోబర్ 22 తేదీన మీసేవా ద్వారా చలనా చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు 8 నెలలు కావస్తున్నా సర్వేయర్ కొలతలు వేయలేదు. రైతు ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది. లంచం ఇవ్వనిదే కొలతలు వేయనని సర్వేయర్ తేల్చిచెప్పాడు. దీంతో రైతు రామసుబ్బారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
గురువారం ఉదయం స్థానిక రెవెన్యూకార్యాలయంలో బాలసుబ్బరాయుడు ఉండగా రైతు రామసుబ్బారెడ్డి ఏసీబీ వారు ఇచ్చిన రూ. 5 వేలను అందజేశాడు. రూ. 13 వేలు ఇస్తే గాని కొలతలకు రానని సర్వేయర్ అనడంతో ప్రస్తుతం రూ. 5 వేలు ఇస్తున్నానని మిగిలినది కొలతలు వేసేటప్పుడు ఇస్తానని చెప్పడంతో ఆ డబ్బులను సర్వేయర్ తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ. 5 వేలను స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌పై కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. దాడులలో ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డి, సీఐలు పార్థసారధిరెడ్డి, సుధాకరరెడ్డి, రాంకిశోర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.