అడంగల్‌లో పేరు మార్చేందుకు నాలుగువేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో పట్టుబడిన సంఘటన మండలంలోని రేబాల సాయిబాబాగుడి వద్ద గురువారం చోటు చేసుకుంది.
బుచ్చిరెడ్డిపాళెం : అడంగల్‌లో పేరు మార్చేందుకు నాలుగువేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో పట్టుబడిన సంఘటన మండలంలోని రేబాల సాయిబాబాగుడి వద్ద గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ కథనం మేరకు... రేబాలకు చెందిన కోరికల ఆదిలక్ష్మమ్మ తన తల్లి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని తహశీల్దార్‌కు వినతిపత్రం ద్వారా సంప్రదించింది. ఈ మేరకు విచారణ చేయాల్సిందిగా వీఆర్వో మల్లికార్జునను ఆదేశించారు. దీంతో వీఆర్వో విచారణకు వెళ్లి అడంగల్‌లో పేరు మార్చేందుకు రూ.4వేలు లంచం అడిగాడు. దీంతో రూ.3వేలు ఇచ్చింది. అయితే మళ్లీ మరో నాలుగువేలు తీసుకురమ్మని అడగడంతో ఆమె ఏసీబీని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. శుక్రవారం రేబాలలో సత్యసాయిబాబా మందిరం వద్ద ఆదిలక్ష్మమ్మ రూ.4వేలు ఇస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శివకుమార్‌రెడ్డి, కృపానందం పాల్గొన్నారు.
రెండు సార్లు నగదు అడిగారు
మా అమ్మ మరణించిన తరువాత ఆ భూమిని నా పేరుమీదకు మార్చాలని అడిగాను. దీంతో నాలుగువేలు ఇవ్వమన్నాడు. మూడు వేలు ఇచ్చారు. మళ్లీ నాలుగువేలు అడిగాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు స్థోమత లేదన్నా,వినలేదు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
ఆదిలక్ష్మమ్మ