పనిష్మెంట్‌లో ఉన్నవారి వివరాలివ్వండి

ACB DG Letter to the Department of General Administration - Sakshi

సాధారణ పరిపాలన శాఖకు ఏసీబీ డీజీ లేఖ

అవినీతి ఉద్యోగుల గుండెల్లో గుబులు..

అవినీతిపరులైన అధికారుల వివరాలు కోరామన్న ప్రచారంలో నిజం లేదన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు

పనిష్మెంట్‌కు గురైన వారి వివరాలు మాత్రమే అడిగామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అవినీతిపరులైన ఉద్యోగుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుబులు రేపుతోంది. తాజాగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇటీవల రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పనిష్మెంట్‌(శాఖాపరమైన చర్యలు)లో ఉన్నవారు, పనిష్మెంట్‌ అమలుకాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలను కోరుతూ ఆయన లేఖ రాశారు. దీంతో ఏసీబీ కోరిన వివరాలివ్వాలంటూ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, హెచ్‌ఓడీలకు జీఏడీ ఉత్తర్వులు(మెమో) జారీ చేసింది. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ దాడులు ముమ్మరం చేయడం తెలిసిందే.

అవినీతికి సంబంధించిన సమాచారం, ఫిర్యాదులకోసం ప్రభుత్వం డయల్‌ 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. టోల్‌ ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తమ టీమ్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజుల్లో రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ హాస్టల్స్, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుపుదాడులు జరిపి.. సోదాలు నిర్వహించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో అవినీతి వేళ్లూనుకున్న కొన్ని శాఖల్లోని ఉద్యోగులు తర్వాత వంతు తమదేమోననే భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జీఏడీకి ఏసీబీ డీజీ రాసిన లేఖ ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అవినీతిపరుల జాబితాకోసం ఏసీబీ దృష్టి పెట్టిందనే ప్రచారం జరగడంతో పలువురు ఉద్యోగుల్లో కంగారు మొదలైంది.  

మేం అడిగింది పనిష్మెంట్‌కు గురైన వారి వివరాలు మాత్రమే
ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులైన అధికారుల వివరాలు కోరినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. అవినీతికి పాల్పడేవారిని ఏసీబీ గుర్తిస్తుంది. అంతేతప్ప ప్రభుత్వ శాఖలను ఆ వివరాలు ఎందుకు అడుగుతాం.. సస్పెండైన ఉద్యోగులు, పనిష్మెంట్‌ అమలు కాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలు మాత్రమే మేం కోరాం. 2019 జూన్‌ 1 తేదీ నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని జీఏడీని కోరడం జరిగింది.     
    – ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top