రాజధానిలో పసికందు కిడ్నాప్ | Abducted child rescued, two held in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో పసికందు కిడ్నాప్

Nov 12 2013 1:35 AM | Updated on Sep 2 2017 12:31 AM

రాజధానిలో పసికందు కిడ్నాప్

రాజధానిలో పసికందు కిడ్నాప్

రాజధాని హైదరాబాద్‌లోని ఫరా మెటర్నిటీ ఆస్పత్రి నుంచి ఐదు రోజుల పసికందు అపహరణకు గురైంది. ఇదివరకే పసిపిల్లలను ఎత్తుకుపోయిన హసీనా, జరీనా అనే ఇద్దరు మహిళలే ఈ చిన్నారిని కూడా అపహరించినట్లుగా భావిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని ఫరా మెటర్నిటీ ఆస్పత్రి నుంచి ఐదు రోజుల పసికందు అపహరణకు గురైంది. ఇదివరకే పసిపిల్లలను ఎత్తుకుపోయిన హసీనా, జరీనా అనే ఇద్దరు మహిళలే ఈ చిన్నారిని కూడా అపహరించినట్లుగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. భోలక్‌పూర్ పద్మశాలి కాలనీకి చెందిన షేక్ సిద్ధిక్ భార్య రెహనా బేగం ఈనెల 7న ఫరా మెటర్నిటీ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో బురఖాతో ఉన్న ఒక మహిళ రెహనా ఉన్న వార్డులోకి వచ్చి ఆమెను పలకరించింది. కొద్దిసేపు అక్కడక్కడే తచ్చాడి, రెహనా నిద్రలోకి జారుకున్న సమయంలో చిన్నారిని తీసుకుని పరారైంది. కొద్దిసేపటికి చిన్నారి లేకపోవడాన్ని గమనించిన రెహనా బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోయింది.
 
  ఆసుపత్రి పక్కన నివసించే స్థానికురాలు ఒకరు.. ఓ మహిళ పాపను తీసుకువెళుతుండగా చూసినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా.. అనుమానితురాలి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే, భోలక్‌పూర్‌లో గత సంవత్సరం షకీల్ అనే వ్యక్తి కూతురును హసీనా, జరీనాలు కిడ్నాప్ చేసి తీసుకువెళుతూ పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసినా.. ఇరువర్గాలు రాజీకి వచ్చి లేఖ రాసివ్వడంతో వదిలేశారు.
 
  ప్రస్తుతం పోలీసులు విడుదల చేసిన ఊహాచిత్రాన్ని చూసిన షకీల్.. అప్పట్లో తన కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించినవారిగా గుర్తుపట్టాడు. దాంతో పోలీసులు నల్లగుట్టలోని ఆ మహిళల ఇంటికి వెళ్లగా వారు అప్పటికే.. హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఆ మహిళ భర్త, కుమారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కుటుంబం రేషన్‌కార్డులో ఉన్న మహిళలను చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా వారిని కిడ్నాపర్లుగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముషీరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. కాగా.. పాప తల్లిదండ్రులు తమకు పుట్టిన ఐదో సంతానాన్ని తమ బంధువులకు ఇస్తామని చెప్పినట్లు తెలియడంతో..  ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాప కిడ్నాప్ విషయంలో ఆసుపత్రి వైఫల్యం లేదని ఫరా ఆసుపత్రి యజమాని డాక్టర్ ఫరేన్‌ఖాన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement