ఇక వాహనాలకూ ఆధార్ | Aadhaar must for vehicle registration, driving licence | Sakshi
Sakshi News home page

ఇక వాహనాలకూ ఆధార్

Dec 13 2014 12:57 AM | Updated on May 24 2018 1:57 PM

ఇక వాహనాలకూ ఆధార్ - Sakshi

ఇక వాహనాలకూ ఆధార్

ప్రతిదానికీ ప్రభుత్వాలు ఆధార్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా వాహనదారులు కూడా ఆధార్ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్న రవాణా శాఖ
 కంబాలచెరువు (రాజమండ్రి) : ప్రతిదానికీ ప్రభుత్వాలు ఆధార్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా వాహనదారులు కూడా ఆధార్ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రవాణా శాఖ శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయంలో జరిగే ప్రతి లావాదేవీని ఇక నుంచి ఆధార్‌తో ముడిపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడూ తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసుకోవాలని రాజమండ్రి ఆర్టీఏ హైమారావు, మోటార్ వెహికల్స్ తనిఖీ అధికారులు పరంధామరెడ్డి, భోగేంద్ర తెలిపారు.

దీనిప్రకారం కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు, డ్రైవింగ్ లెసైన్సులు పొందేవారు ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలన్నారు. జిల్లాలో 9 లక్షలు పైగా వాహనాలుండగా, లెసైన్సుదారులు 9.30 లక్షల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరందరికీ కూడా ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. వీరు ఆర్టీఏ కార్యాలయంలోను, ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల వద్ద, ఆన్‌లైన్ విధానంలోను ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవచ్చు. పెట్రోల్ బంక్‌ల వద్ద ఈ నెల 13 నుంచి మెప్మా సిబ్బంది ఈ పక్రియ చేపడతారు.
 
ఆన్‌లైన్‌లో ఎలాగంటే..
ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఆధార్ నమోదు చేసుకోవచ్చు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్.ఆర్గ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ కుడివైపున ఆధార్ నంబర్ ఎంట్రీ అనే కాలమ్ కనిపిస్తుంది. లేదా సైట్‌లో ఆంధ్రప్రదేశ్ పటం కింద అడ్డంగా కదిలే బాక్సుపై క్లిక్ చేసినా సరిపోతుంది. తర్వాత స్క్రీన్‌లో ఆధార్ నమోదు వాహనానికా, లెసైన్సుకా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దానిని క్లిక్ చేస్తే మీ వివరాలు వస్తాయి. అక్కడ ఖాళీగా ఉన్న గడిలో ఆధార్ నంబర్ నమోదు చేస్తే సరిపోతుంది.
 
చిరునామాలు పట్టడం తేలిక
ఈ విధానంవల్ల వాహనాలు, సంబంధిత వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం చాలా తేలికవుతుందని అధికారులు చెబుతున్నారు. వాహన ప్రమాదాలు, వాహన చోరీలువంటి విధంగా పలు అంశాల్లో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
 
రేషన్ కార్డుల ఎగవేతకేనంటున్న వినియోగదారులు
మోటార్ వాహనాలున్నవారికి తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని, ఇందులో భాగంగానే వాహనాలు, లెసైన్సులకు ఆధార్ మెలిక పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆధార్ నమోదుతో ఎవరికి వాహనం ఉందో తెలిసిపోతుందని, తద్వారా వారికి తెల్ల రేషన్ కార్డు తొలగిస్తారని వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement