
హైదరబాద్ : ‘నేను తాజా మాజీ ఎంపీని. నా కారు ఆపి సైరన్ తొలగిస్తారా.. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని.. నీ ప్రాంతం కాకున్నా సైరన్ తొలగిస్తారా.. ఇక్కడ ఏ మంత్రికి ఫోన్ చేయమంటారు..?’ అంటూ ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు.
మంగళవారం ఉదయం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సాయిప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తదితరులు సైరన్లు, సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అదే సమయంలో ఓ కారును ఆపగా, అందులో కూర్చొన్న వ్యక్తి తాను మాజీ ఎంపీనని, తాము సైరన్లు పెట్టుకోవచ్చని, ఏపీలో కాకుండా ఇక్కడ తొలగించడానికి మీకు ఏమి హక్కు ఉందంటూ నిలదీశాడు.
ఎంపీలైనా సరే సైరన్లు పెట్టుకోవద్దు సార్ అంటూ పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇక్కడ మంత్రులంతా తనకు తెలుసునని, ఎవరికి ఫోన్ చేయమంటావంటూ ఆగ్రహించారు. అయితే స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మోటారు వాహన చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటుచేసిన సైరన్లను తొలగిస్తున్నామని, ఇది కూడా తొలగించాల్సిందేనని సూచిస్తూ ఆయన కారులో ఏర్పాటుచేసిన సైరన్‌ను పోలీసులు తొలగించారు.