ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు

59 lakh above illegal voters in AP - Sakshi

రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లు 39.11 లక్షలు 

రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా నమోదైన వారు 20.07 లక్షల మంది

ఈసీకి నకిలీ ఓటర్ల వివరాలు ఇచ్చిన ‘వాస్ట్‌’ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌ (వాస్ట్‌)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్‌ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్‌ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు.

ఆ తరువాత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ఓ ఓటరుకు 351 ఏళ్ల వయసు ఉన్నట్టుగా జాబితాలో నమోదు చేశారని, 18 సంవత్సరాలలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఇంటి నంబర్లు లేకుండా కూడా పలువురి ఓట్లను నమోదు చేశారని తెలిపారు. నకిలీ ఓట్లను తాము 12 రకాల పద్ధతుల ద్వారా గుర్తించామని తెలిపారు. ఒకే ఓటర్‌ ఐడీతో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇటువంటి ఓటర్లు 9,552 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నంబరు, జెండర్‌ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 52,180 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి జెండర్‌ మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,224 ఉన్నారని, ఇతర వివరాలు ఒకేలా ఉండి తండ్రి లేదా భర్త పేరు మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,78,868 ఉన్నారని చెప్పారు.

ఓటరు పేరు ముందుకు, వెనుకకు మారిన నకిలీ ఓటర్లు (ఉదాహరణకు వరలక్ష్మి కొండేటి– కొండేటి వరలక్ష్మి) వంటివి 1,69,448 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు ఒకే విధంగా ఉండి, ఇతర వివరాలు వేరే విధంగా ఉన్న ఓటర్లు 25,17,630 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి ఇంటి నంబరులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 4,49,126 ఉన్నారని, ఓటరు పేరు పలకడానికి ఒక రకంగా, ఒకటి రెండు అక్షరాల మార్పులతో ఉండే నకిలీవి 2,36,626 ఉన్నాయని వివరించారు. ఇంటి నంబరు తప్పు ఉన్న ఓటర్లు 2,15,119 ఉన్నారని చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top