‘ఓటు’లో పురుషాధిక్యం | 51 per cent of men voting | Sakshi
Sakshi News home page

‘ఓటు’లో పురుషాధిక్యం

May 10 2014 12:49 AM | Updated on Sep 2 2017 7:08 AM

‘ఓటు’లో పురుషాధిక్యం

‘ఓటు’లో పురుషాధిక్యం

జిల్లాలో ట్రెండ్ మారింది. సీమాంధ్రలో అత్యధిక జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకొని నిర్ణయాత్మకశక్తిగా అవతరించారు.

ట్రెండ్ మారింది
 జిల్లాలో 49 శాతం మహిళల ఓటింగ్
 51 శాతం పురుషుల ఓటింగ్
 ఏడు నియోజకవర్గాల్లోనే మహిళల ఓటింగ్ అధికం
 నగరంలో మాత్రం పురుషులదే పై చేయి

 
సాక్షి, విజయవాడ : జిల్లాలో ట్రెండ్ మారింది. సీమాంధ్రలో అత్యధిక జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకొని నిర్ణయాత్మకశక్తిగా అవతరించారు. కాని జిల్లాలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నా పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంది మాత్రం తక్కువే. అదికూడా పురుష ఓటర్ల కంటే కేవలం ఒక్క శాతం తక్కువగా మహిళ ఓటర్లు ఓటు వేశారు.

జిల్లాలో సగటున 51 శాతం పురుషుల ఓటింగ్ నమోదు కాగా సుమారుగా 49 శాతం మహిళల  ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా గుడివాడ, జగ్గయ్యపేటలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 33,37,071 మంది ఓటర్లకుగాను సార్వత్రిక ఎన్నికల్లో 26,76,149 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 78.34 శాతంగా పోలింగ్ నమోదైంది. వీరిలో 13,42,052 మంది పురుషులు, మహిళలు 13,34,081 మంది ఓటు వేశారు.

అంటే జిల్లాలో పురుష ఓటర్లే కీలకంగా మారారు. 7,971 మంది పురుషులు మహిళల కంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలు మినహా 13 నియోజకవర్గాల్లో అత్యధికంగా 7 నియోజకవర్గాలలో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారారు.

గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా 3,606 మంది మహిళలు, జగ్గయ్యపేటలో 2,383, గన్నవరంలో 1,989, మచిలీపట్నంలో 1787, పామర్రులో 1024, పెనమలూరులో 898, నందిగామలో 1,463 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా నూజివీడు నియోజకవర్గంలో 87 శాతం పోలింగ్ నమోదవగా పురుషులదే పైచేయిగా ఉంది.
 
నగరంలో పురుషుల హవా...
 
విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారి అత్యధిక శాతం మంది ఓటు హక్కున వినియోగించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 6,150 మంది పురుషులు, సెంట్రల్‌లో 1,825 మంది, తూర్పు నియోజకవర్గంలో 2,659 మంది పురుషులు మహిళలకంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నగరంలో మహిళల ఓటింగ్ తగ్గటం పోలింగ్ శాతంపై తీవ్రంగా ప్రభావం చూపింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సగటున 75 శాతం పోలింగ్ నమోదయితే నగరంలో మాత్రం సగటున 66 శాతం మాత్రమే నమోదైంది.
 
జిల్లాలో 6.60 లక్షల మంది  ఓటింగ్‌కు దూరం
 
జిల్లాలో సగటున 78.34 పోలింగ్ శాతం నమోదయింది. జిల్లాలో మొత్తం 33,37,071 మంది ఓటర్లకు ఈసారి 26,76,149 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 6,60,922 మంది ఓటింగ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు. గుడివాడలో సుమారు 40 వేల మందికిపైగా, నూజివీడులో సుమారు 27 వేల మందికి పైగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 20 నుంచి 25 వేల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 60 నుంచి 80 వేల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement