అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 

50 percent of outsourcing jobs are for BC, SC, ST and minorities - Sakshi

అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్‌ 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ 

ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు 

కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లా స్థాయిలో విభాగాలు 

జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వం, ఎక్స్‌ అఫిషియోగా కలెక్టర్‌ 

వెబ్‌ పోర్టల్‌ ద్వారా నియామకాలు.. ఆన్‌లైన్‌ ద్వారా జీతాల చెల్లింపు   

సాక్షి, అమరావతి: మరో కీలక హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో మొత్తంగా 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్ష మందికి పైగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరు ఆయా ఏజెన్సీల ద్వారా నియామకం అవుతున్నారు. ఈ నియామకాల్లో అందరికీ అవకాశాలు దక్కడం లేదు. మరోవైపు పనికి తగినట్టుగా జీతం పూర్తి స్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నచ్చిన రీతిలో నియామకాలను చేపడుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం కార్పొరేషన్‌ ఏర్పాటవుతోంది. ఈ అంశాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్‌ పని చేస్తుంది. దీనికి అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలుంటాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు. జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్‌కు ఎక్స్‌ అఫిషియోలుగా వ్యవహరిస్తారు

ముఖ్యాంశాలు, ఉపయోగాలు
- రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్‌కు, దీని కింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి. 
- ఒక వెబ్‌ పోర్టల్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలను చేపడతారు. 
- అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. 
- డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 
- ఎలాంటి దళారీలు లేదా ఏజెన్సీలు లేకుండా నేరుగా ఈ కార్పొరేషన్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను పొందే అవకాశం ఏర్పడుతుంది.
- మహిళలకు, సమాజంలో అట్టడుగు వర్గాలకూ సముచిత ప్రాధాన్యం దక్కుతుంది.
ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న వారికి ఒకే పనికి ఒకే రకమైన జీతం లభిస్తుంది. 
- ఎలాంటి ఆలస్యం జరక్కుండా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top