చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మిస్తున్న పైలాన్‌ను ఈనెల 29న అవిష్కరించేందుకు...
వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మిస్తున్న పైలాన్‌ను ఈనెల 29న అవిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమా భారతి వస్తున్నట్లు అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందించడంతో పనులు వేగవంతమయ్యాయి.
ఈనెల 6వ తేదీన పైలాన్ నిర్మాణం ప్రారంభం కాగా, సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ పనుల్లో ఎలాంటి జాప్యం జరుగలేదు. మరో మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 22 నాటికి పైలాన్ ఆవిష్కరణకు సిద్ధం చేస్తామని ఉన్నతాధికారులకు జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు.
దేశంలోనే చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినందున కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 26న గణతంత్ర దినోత్సవం ఉన్నందున 29వ తేదీన పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ఉమాభారతి అంగీకారం తెలిపినట్లు సమాచారం.