యలమంచిలిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.
యలమంచిలి: యలమంచిలిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్థానిక బస్‌కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై సుమారు 28 ఏళ్ల మహిళ రోడ్డుపై పాక్కుంటూ కనిపించింది. అతికష్టం మీద పక్కన ఉన్న వాణిజ్య సముదాయం మెట్లపైకి చేరుకుంది. తరువాత స్పృహ కోల్పోయింది. మద్యం వాసన వస్తోంది. ఆమె శరీరంపై దుస్తులు చెదిరిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు మహిళలు దుస్తులు సరిచేశారు. ఆమె వెంట సుమారు ఏడాది చిన్నారి కూడా ఉంది.
ఇది గమనించిన విలేకరులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఫిర్యాదు ఉంటేగాని తాము పట్టించుకోలేమని చెప్పడం విశేషం. సాక్షి విలేకరి ద్వారా విషయం తెలుసుకున్న యలమంచిలి ఐసీడీఎస్ సీడీపీవో విజయ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికి స్పృహలోకి వచ్చిన ఆ మహిళ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఏమీ చెప్పలేకపోయిది.
ఆ మహిళ చిన్నారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించి, తరువాత యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి సీడీపీవో తరలించారు. ఎవరో ఆమెకు పూటుగా మద్యం తాపించి అత్యాచారం చేసి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అంతకు ముందు ఆమెను ఎవరో కొందరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి యలమంచిలి బస్‌కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.