బాల్యానికి శాపం వివాహం

150 Child Marriages Stops In Yearly West Godavari - Sakshi

అవగాహనా లేమితో పెరుగుతున్న బాల్య వివాహాలు

జిల్లాలో సుమారు 150 పెళ్లిళ్లను అడ్డుకున్న అధికారులు

బాల్య వివాహ చట్టం మరింత కఠినం

పశ్చిమగోదావరి, నిడదవోలు : తెలిసీ తెలియని వయసులో లోకం పోకడే తెలియని లేలేత వయసులో మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్న అభాగ్యాలు ఎందరో. బాలికా వధువులు, చిన్నారి పెళ్లి కూతుళ్లకు వివాహాలు చేసి బాలికల గొంతు కోస్తున్నారు. 12 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్న సంఘటనలు గ్రామాల్లో ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. కట్టుబాట్లకు, కరెన్సీ నోట్లకు బలిపశువులుగా చిన్నారులు మారుతున్నారు.

ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, ఇంట్లో ఆడపిల్లలను వదిలించుకోవాలనే పేద వర్గాల దృక్పథం, సమాజంలో ఆమ్మాయిల సంఖ్య మగవారికంటే తక్కువగా ఉండటంతో ఇటీవల బాల్య వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాహాలు వెలుగులోకి వచ్చేవి కొన్నైయితే.. వెలుగులోకి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నవి ఎన్నో ఉన్నాయి.  బాల్య వివాహల నిరోధక చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేస్తే ఇరువురి కుటుంబాల పెద్దలకు కఠిక శిక్షలు అమలు కావడంతో పాటు భారీగా జరిమానాలు విధించవచ్చునని చట్టాలు చెబుతున్నాయి.

అనాధి నుంచి వస్తున్న దురాచారం
విదేశీయులు ఇండియాను పాలించే కాలంలో కొందరు విదేశీ అధికారులు కన్యలను బలవంతంగా వివాహమాడేవారు. మరి కొందరిని చెరిచేవారు. ఇలాంటి దారుణ సంఘటన నేపధ్యంలో భారతీయులు తమ పిల్లలను బాల్యంలేనే వివాహాలు చేసేవారు. దీంతో అప్పటి నుండి బాల్య వివాహాల పరంపర కొపసాగుతూ వస్తుంది. పూర్వం కుటుంబాల మధ్యపరస్పర సంబంధాలను కొనసాగించుటకు మరింతగా పటిష్ట పరుచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలు నిర్ణయించుకుని పిల్లలు కొంచెం పెద్దవ్వగానే వివాహాలు చేసేవారు. అలాగే మరణశయ్యపై ఉన్న వృద్ధుల చివరి కోరిక తీర్చేందుకు కూడా ఇలా ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహ బంధీఖానాలోకి నెట్టేసేవారు. చిన్నవయసులోనే వివాహం కారణంగా భర్త చనిపోతే బాల వితంతువులుగా మారేవారు.  కందుకూరి వంటి సంఘ సంస్కర్తల కృషితో బాల్యవివాహాలను నిషేధించారు. అయినా ఇప్పటికే అక్కడక్కడా మారుమూల గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

చట్ట ప్రకారం..
1922లోనే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే 2006 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ చట్ట ప్రకారం ఆడ పిల్లలకు 18, మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు జరిపించాలి. ఈ వయసు నాటికే వారిలో శారీరక, మానసిక పరిపక్వత వస్తుందని వైద్యులు చెబుతున్నారు.  అయితే ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంటే కలెక్టర్, మెజిస్ట్రేట్, రెవెన్యూ, పోలీసు, అంగన్‌వాడీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, బాల్య వివాహానికి అనుమతించిన పెద్దలు, సహకరించినవారందరూ నేరస్తులుగానే పరిగణిస్తారు. బాల్య వివాహం చేసినట్టు రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారంతో పాటు రూ.లక్ష జరిమానా విధించవచ్చును. దీని ప్రకారం బాల్య వివాహాలను నిలిపివేస్తూ కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ జారీ చేయవచ్చును. ఈ నేరాలకు బెయిల్‌ కూడా ఇవ్వరు.  బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్,  గ్రామస్థాయిలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహిస్తారు. బాల్య వివాహాలను రూపుమాపేందుకు వివాహ నమోదు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వధూవరుల వయసుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందిస్తేనే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

ఏడాదిలో 150వివాహాలు నిలిపివేత
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. చాలా మందికి అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చినా లెక్క చేయని వారిపై చర్యలు చేపట్టారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం ఇంత వరకు ఐదుకేసులు నమోదయ్యాయి. నిడదవోలు మండలం  సమిశ్రగూడెం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో నిడదవోలు, చాగల్లు మండలాల్లో రెండు నెలల వ్యవధిలో 15 బాల్య వివాహాలను అడ్డుకున్నారు.

కందుకూరి కృషితో..
చిన్న వయసులోనే వివాహం వలన చదువుకునే అవకాశం బాలికలు కోల్పోతున్నారు. శారీరక నిర్మాణం బలపడకుండానే గర్భవతులు అయితే తల్లితో పాటు పుట్టిన బిడ్డలు కూడా బలహీనంగా ఉంటారు. పూర్వం బాల్య వివాహాలు అంటే ఆరేడేళ్ల వయసు అమ్మాయిలతో  40, 50 ఏళ్ల వ్యక్తులతో జరిగేవి. దీంతో భర్త ముందుగా చనిపోవడంతో బాల వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కొన్ని కుటుంబాల్లో తలనీలాలు తీసేసి వీధిలోకి రాకుండా ఇంట్లోనే ఉంచేవారు. అభ్యుదయ వాది కందుకూరి కృషితో పునర్వివాహం చేసేందుకు ఉద్యమించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత ప్రభుత్వం బాల్య వివాహాల నిషేద చట్టం చేశారు.– కొండ నిర్మల, సీనియర్‌ సిటిజన్‌ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు, నిడదవోలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top