కుయ్‌కుయ్‌..నయ్‌నయ్‌

108 Service Staff Suffering With Wages Delayed - Sakshi

పేదల సంజీవని 108కు పెద్ద కష్టం

వాహనాల మరమ్మతులకునిధులు సరఫరా కాని వైనం

సిబ్బందికి నాలుగు నెలలుగా అందని వేతనాలు

పార్వతీపురం:  ప్రజలకు 108 వాహనాల సేవలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అనారోగ్యంతో బాధపడేవారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ వాహనాలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కునారిళ్లుతున్నాయి. ఒకప్పుడు ఒక్క ఫోన్‌తో వచ్చే వాహనాలు, ఇప్పుడు రాకపోవడంతో ఆటోల్లో రోగులను తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 108 వాహనాల ఏర్పాటు లక్ష్యం కుంటుపడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటి నిర్వహణ సంస్థలను మారుస్తుండడం కూడా వీటి దారుణ స్థితికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఉద్యోగులకు అందని వేతనాలు..
వాహనాల పరిస్థితి ఎలా ఉందో, వాటిలో పని చేసే ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. గతంలో జీవీకే సంస్థ నిర్వహణ చూసేది. 2017 డిసెంబర్‌లో బీవీజీ (భారతీయ వికాస్‌ గ్రూప్‌)కు బాధ్యతలు మారాయి. అప్పటికి జీవీకే వారు మూడు నెలల జీతాన్ని సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి రూ.12,500 చొప్పున మూడు నెలలకు గానూ రూ.37,500 ఇవ్వాల్సి ఉంది. మొత్తం 153 మంది ఉద్యోగులకు రూ.57,37,500 బకాయి ఉంది. ఆ మొత్తాన్ని జీవీకే చెల్లించలేదు. కొత్త సంస్థకు అప్పగించ లేదు. దీంతో నాలుగు నెలలుగా 108 సిబ్బంది వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగుల రిలీవింగ్‌ బిల్లులు, గ్రాట్యూటీ అంశాలు కొత్త సంస్థ చేతికి ఇవ్వలేదు. దీంతో 108 ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతున్నారు.

సరఫరా కాని మందులు..
వైఎస్సార్‌ హయాంలో 108 వాహనాలకు 108 రకాల మందులు సరఫరా చేసేవారు. రోగులను ఆస్పత్రికి చేర్చేలోపు ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు దానిలో ఉండేవి. జీవీకే వారు కూడా 100 రకాల మందులు అందించేవారు. కానీ బీవీజీ సంస్థ వారు 108 నిర్వహణ బాధ్యతలను తీసుకున్న తర్వాత 57 రకాల మందులను మాత్రమే ఇస్తున్నారు. ఈఎంటీ, ఫైలెట్‌లకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు నేటికి ఇవ్వలేదు. రోగుల కోసం మందులు, సూదులు, ఎట్రోసిన్, ఎడ్రినాలిన్‌ వంటి మందులు, గుండెనొప్పితో బాధపడే వారికి ఇచ్చే సార్బిట్‌ రేట్‌ ట్యాబ్‌లెట్లను, డెలివరీ కిట్స్‌ను సరఫరా చేయలేదు. ఆక్సిజన్‌ సిలెండర్లను కూడా సరఫరా చేయడం లేదు. ఇలాంటి స్థితిలో ఆటోలో వెళ్లినా, అంబులెన్స్‌లో వెళ్లినా ఒకటేనని రోగులు అంటున్నారు.

మరమ్మతులకు నిధులు లేవు..
108 వాహనాలు చాలా పాతవి. ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన గ్రామాల వాసులకు సేవలు అందిస్తుంటాయి. చాలా వరకు మట్టి, రాళ్ల రోడ్లలో ప్రయాణిం చాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మరమ్మతుల బారిన పడుతుంటాయి. వాటిని బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాల్సి ఉం టుంది. కానీ ఆ పని జరగలేదు. దీంతో వాహనాలు రోడ్డు పక్కనే ఆగిపోతున్నాయి.

నాలుగు నెలల జీతం రావాలి..
నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. పాడైన వాహనాన్ని బాగు చేయలేదు. ఆది పని చేస్తే కాని వేతనాలు ఇవ్వరంటా, దీంతో కుటుంబం అవస్థలు పడుతోంది.– ఉరిటి వేణు, కురుపాం, ఈఎంటీ.
వాహనం నడిస్తే ఒకలా, నడవకుంటే ఒకలా జీతం ఇస్తున్నారు. ఇంతకు ముందు వచ్చే రూ.12,500 జీతం ఇప్పుడు రావడం లేదు.దీనసరి కూలీల్లాగే చూస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకుని ఉద్యోగ భద్రత కల్పించాలి. వాహనాల మరమ్మతులకు నిధులు కేటాయించాలని. మోనటరింగ్‌ చేసేందుకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలి.  – మజ్జి రాజారావు, పైలెట్, గుమ్మలక్ష్మీపురం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top