ప్రాణం పోశారు

rare surgery in sarvajana hospital - Sakshi

సర్వజనాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

దవడలో క్యాన్సర్‌ గడ్డ తొలగింపు

అనంతపురం న్యూసిటీ:   జిల్లా సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ రోగికి ప్రాణం పోశారు. 72 సంవత్సరాల వృద్ధుడికి మూడు గంటల పాటు శ్రమించి క్యాన్సర్‌ గడ్డను విజయవంతంగా తొలగించారు. వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, సర్జరీ అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీలు డాక్టర్‌ రామస్వామి నాయక్, డాక్టర్‌ నవీన్, సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ కె.ఎల్‌.సుబ్రహ్మణ్యం సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన పి.బాలాజీ అనే వృద్ధుడికి దవడ కింది భాగంలో క్యాన్సర్‌ గడ్డ ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్‌ 30న అతన్ని కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో దవడ నుంచి కొంత భాగాన్ని తీసి బయాస్సీకి పంపారు. పరీక్షల అనంతరం అది కార్సినోమా (క్యాన్సర్‌) గడ్డగా తేలింది. అదే సమయంలో రోగి గుండె సంబంధిత వ్యాధి, ఆస్తమా, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం చేసిన బైపాస్‌ సర్జరీ ఫెయిల్యూర్‌ దశకు చేరడంతో గుండె 28 శాతం మాత్రమే పనిచేస్తోందని తెలుసుకున్నారు. జనరల్‌ అనస్తీషియా ఇస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో బాలాజీ కుమారులు రమేష్, గిరిప్రసాద్‌తో వైద్యులు సంప్రదించారు.

వారి అనుమతితో ఈ నెల 24న సర్వజనాస్పత్రిలోనే రోగి ఎడమ కన్ను కింది భాగం నుంచి ఛాతీ వరకు అనస్తీషియా ఇచ్చి మూడు గంటల్లోనే సర్జరీ చేసి క్యాన్సర్‌ గడ్డను తొలగించారు. ఇది చాలా అరుదైన శస్త్రచికిత్సగా ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. దీనిని ఒక సవాల్‌గా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఎస్‌ఐసీయూలో ఉంచిన రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో వారం అడ్మిషన్‌లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top