ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో చామల, వివేక్, మహేశ్‌గౌడ్, వాకిటి శ్రీహరి, పొన్నం, భట్టి, అడ్లూరి, అజహరుద్దీన్. హాజరైన ప్రజలు, కార్యకర్తలు
రామ్‌లీలా మైదాన్ నుంచే కాంగ్రెస్ శ్రేణుల సమరశంఖం
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీ సర్కార్
మోదీని నాలుగోసారి గద్దెనెక్కించడానికే ఓట్ల దోపిడీ
ఈసీ స్వతంత్రతను కోల్పోయింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, న్యూఢిల్లీ: నాడు రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సేన తోడ్పడినట్లు, నేడు మోదీని ఓడించేందుకు వానర సైన్యంలా తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని విమర్శించారు. ఈ ఓటు చోరీపై రామ్‌లీలా మైదాన్‌లో తాము సమరశంఖం పూరిస్తున్నామని అన్నారు. ఇండియా కూటమి ర్యాలీ ప్రారంభం సందర్భంగా తెలంగాణ భవన్లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
దేశంలో ఇప్పటికే 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి అక్రమంగా తొలగించారని, రానున్న రోజుల్లో మరో 20 కోట్ల మంది పేదలు, బలహీన వర్గాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి పెద్ద కుట్రలకే తెరలేపుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కులాలు, మతాలు, వర్గాల పేరిట బ్రిటిష్ వారి మాదిరిగా ‘విభజించు పాలించు’సిద్ధాంతంతో తొలి రెండుసార్లు మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మూడోసారి 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చాలని, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లు తొలగించాలని యోచించారని, అయితే వారు ఆశించిన సంఖ్యలో సీట్లు రాకపోవడంతో ఆయా వర్గాలపై కక్ష పెంచుకున్న మోదీ ప్రభుత్వం వారి ఓట్లను తొలగించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసాన్ని సహించం
మోదీని మళ్లీ నాలుగోసారి గద్దెనెక్కించడానికి ‘సర్’పేరిట జరుగుతున్న ఓట్ల దోపిడీని, ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసాన్ని తాము సహించబోమని రేవంత్ హెచ్చరించారు. అన్యాయంపై పోరాటంలో తెలంగాణ నేల ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ రోజు ఢిల్లీ వేదికగా దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి తాము పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి 15 వేల మంది వరకూ రైళ్లలో తరలి వచ్చేలా పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తే, వారు ఢిల్లీకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రైళ్లను అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశా>రు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైళ్లను ఆపేసినా వేలాది మంది తెలంగాణ గడ్డ నుంచి సైనికుల్లా దేశ రాజధానికి తరలివచ్చారని సీఎం చెప్పారు.
అది ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడమే: భట్టి
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి, బీజేపీ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ‘సర్’పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్ల అభిప్రాయాలను సైతం ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని స్వయంగా కమిషనర్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ఓటు హక్కును హరించడమంటే ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడమేనని చెప్పారు.ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన స్వతంత్ర నిర్ణయాలతో పని చేయాలని సూచించారు.
అందరూ భాగస్వాములు కావాలి: మహేశ్‌గౌడ్
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు రామ్‌లీలా మైదానానికి తరలిరావడం రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే మార్పుకు నాందిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఓట్లను దొంగిలించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు.
ఆ పార్టీ తెలంగాణ పేరు చెబితేనే భయపడుతోందన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ, ఓట్లను తొలగిస్తూ అన్యాయానికి పాల్పడుతున్నందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు శిక్ష తప్పదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ఓటు చోరీలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది కాబట్టే ఆయన ఒక దొంగను కాపాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా పోరాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అడ్రస్ మారితే ఓటర్ లిస్టు నుంచి ఓట్లను ఎలా తొలగిస్తారంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ బీజేపీ ప్రభుత్వం జ్ఞానేశ్‌కుమార్‌ను వెనకేసుకొస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
కదం తొక్కిన రాష్ట్ర కాంగ్రెస్ దండు
ఇండియా కూటమి ర్యాలీలో తెలంగాణ నేతల హల్చల్
తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా వరకు ఎక్కడ చూసినా రాష్ట్ర శ్రేణులే
ముందుండి నడిపించిన సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ( ఎస్ఐఆర్)ను నిరసిస్తూ ఇండియా కూటమి పక్షాలు రామ్‌లీలా వేదికగా నిర్వహించిన చలో ఢిల్లీ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ను తక్షణం నిలిపివేయాలన్న డిమాండ్‌తో ఇండియా కూటమి పక్షాలు చేపట్టిన ర్యాలీకి హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్, పార్టీ జాతీయ కార్యాలయమైన ఇందిరాభవన్ మొదలు మిండ్రోడ్డు నుంచి రామ్‌లీలా వరకు నేతల కోలాహలం కనిపించింది. సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ వారికి నాయకత్వం వహించారు.
ఉరకలేసిన ఉత్సాహం..
శనివారం రాత్రి నుంచే నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకోగా, ఆదివారం ఉదయం నాటికి రైలు, బస్సు, ప్రైవేటు వాహనాల ద్వారా వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే పరిసరాలన్నీ రాష్ట్రనేతలు, వారి ఫ్లెక్సీలతో నిండిపోయాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఉదయం పదిన్నరకే తెలంగాణ భవన్ చేరుకోవడంతో ఆయా జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు, శ్రేణులు వారితో కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించాయి.
సీఎం ప్రసంగం తర్వాత స్వల్ప తొక్కిసలాట
11.30 గంటల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో కోలాహలం మరింత పెరిగింది. భారీ సంఖ్యలో వచి్చన శ్రేణులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం అనంతరం అక్కడినుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు ఎగబడటంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. కాగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మిండ్రోడ్డు వరకు చేరుకొని అక్కడ నిరసన తెలిపారు.
సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రామ్‌లీలాకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేజీలోనూ తెలంగాణ నేతల హల్చల్ కనిపించింది. చాలా సీట్లలో ముందు వరుసల్లో రాష్ట్ర నేతలే ఉన్నారు. ఇక భవన్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ రాహుల్‌గాం«దీ, ప్రియాంకాగాం«దీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ తదితరులతో కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో ర్యాలీగా రామ్‌లీలాకు వెళ్లారు. ర్యాలీ పూర్తయ్యేంతవరకు అక్కడే ఉన్నారు.


