వన్డేల్లో మరో డబుల్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

23 సిక్స్‌లతో ఆసీస్‌ క్రికెటర్‌ విధ్వంసం

Published Fri, Sep 28 2018 3:27 PM

D'Arcy Short Blasts 23 Sixes in 50 Over Match - Sakshi

సిడ్నీ : డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డీఆర్సీ షార్ట్‌ విధ్వంసం సృష్టించాడు. 148 బంతుల్లో 23 సిక్సర్లతో 257 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ నమోదు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వెస్టర్న్‌ ఆస్ట్రేలియా, క్విన్స్‌లాండ్‌ మధ్య జరిగిన దేశవాళి వన్డే మ్యాచ్‌లో డీఆర్సీ ఈ ఘనతను అందుకున్నాడు. వెస్టర్న్‌ ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగిన డీఆర్సీ.. 83 బంతుల్లో సెంచరీ సాధించగా.. మరో 100 పరుగులను 45 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇన్నింగ్స్‌ 46 ఓవర్లో డీఆర్సీ ఔటయ్యాడు.. కానీ లేకపోతే ట్రిపుల్‌ సెంచరీ సాధించేవాడన్నట్లు సాగింది అతని బ్యాటింగ్‌. ఇక ఈ మ్యాచ్‌లో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా 106 పరుగుల తేడాతో క్విన్స్‌లాండ్‌పై విజయం సాధించింది.

వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా డీఆర్సీ నిలిచాడు. డీఆర్సీ కన్నా ముందు అలిస్టైర్‌ బ్రౌన్‌, రోహిత్‌ శర్మలున్నారు. 2002లో జరిగిన లిస్ట్‌-ఏ మ్యాచ్‌లో సర్రే తరుపున అలిస్టర్‌ బ్రౌన్‌ 268 పరుగులు చేయగా.. 2014లో శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ వన్డేలో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ  264 పరుగులు చేశాడు. 23 సిక్స్‌లతో డబుల్‌ సెంచరీ సాధించిన డీఆర్సీ.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా కూడా గుర్తింపు పొందాడు.

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కొలిన్‌ మున్రో ఒక్కడే డొమెస్టిక్‌ క్రికెట్‌లో 23 సిక్స్‌లు బాదాడు.  అంతేకాకుండా ఆస్ట్రేలియా లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 23 సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఈ ఏడాదే ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన డీఆర్సీ.. 10 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.

Advertisement
Advertisement