ప్రభుత్వ దగాకు తోడు ప్రకృతి కూడా అన్నదాతపై పగబట్టింది. ఈ ఏడాది తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో జిల్లా లోని వ్యవసాయ క్షేత్రాలన్నీ నెర్రెలు బారి బీడు భూములుగా మారిపోయాయి.
ఖరీఫ్ వైఫల్యం: ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి జిల్లావ్యాప్తంగా సాధారణ సాగులో కేవలం 63 శాతం మేరకే పంటలు సాగుకాగా, మిగతా 37 శాతం పొలాలు సాగుకు నోచుకోక బీళ్లుగానే మిగిలిపోయాయి.
రబీ నరకం: ఇక ప్రస్తుత రబీ సీజన్‌కు వస్తే.. సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో కేవలం 17 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. సాగు నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు అసలు విత్తనం వేయడానికే భయపడుతున్నారు.


