ప్రభుత్వానికి నివేదికలు పంపించాం: డీఏఓ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి నివేదికలు పంపించాం: డీఏఓ

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

ప్రభుత్వానికి నివేదికలు పంపించాం: డీఏఓ

కడప అగ్రికల్చర్‌: ఆరుగాలం కష్టపడి దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడి, కంటికి రెప్పలా కాపాడాల్సిన కనీస ధర్మాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. తమ కేమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండటంతో రైతాంగం అడుగడుగునా దగాపడుతోంది. ఒకవైపు కూటమి సర్కార్‌ అలసత్వం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు తోడై రైతన్నను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కష్టకాలంలో ఆదుకోవాల్సిన పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారం కూడా సకాలంలో అందకపోవడంతో జిల్లావ్యాప్తంగా కర్షకులు కుంగిపోతున్నారు.

తుఫానుల బీభత్సం.. అంకెల్లో దగా!

గతేడాది జనవరి వరకు వరుసగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు ‘మిచౌంగ్‌’, మోంథా, తుపాన్లు సృష్టించిన బీభత్సానికి సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన తరుణంలో పెట్టుబడులు కూడా రాకుండా కష్టమంతా వర్షార్పణమవడంతో రైతాంగం కోలుకోలేని విధంగా నష్టపోయింది. అధికారిక నివేదికల ప్రకారం జిల్లావ్యాప్తంగా వరి, మినుము, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు సంబంధించి మొత్తం 6,876 మంది రైతులకు చెందిన 4,330.84 హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీనివల్ల రైతులకు రూ.994.79 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు నిర్ధారించాయి.

రెండేళ్ల నిరీక్షణ..

ఇంతటి భారీ విపత్తు జరిగితే, కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కంటితుడుపుగా కాసిన్ని నిధులను మాత్రమే విదిల్చింది. ఇందులో భాగంగా కేవలం 1,144 మంది రైతులకు చెందిన 770.59 హెక్టార్లకు మాత్రమే పరిహారాన్ని పరిమితం చేస్తూ రూ.129 లక్షలను విడుదల చేసింది. ఇంకా 5,732 మంది బాధితులకు సంబంధించిన 3,560.25 హెక్టార్ల పంట నష్టానికి గాను రూ.865.1 లక్షల భారీ బకాయిలను గాలికి వదిలేయడంతో, మిగతా రైతులు ఈ పరిహారం ఎప్పుడు విడుదలవుతుందోనని కొండంత ఆశతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది.

ఈ పంట నష్ట పరిహారం బకాయిలపై జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు వివరణ కోరగా.. మిచౌంగ్‌, మెంఽథా తుఫానుతో పాటు అధిక వర్షాల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టాన్ని క్షుణ్ణంగా అంచనా వేసి ప్రభుత్వానికి పూర్తి నివేదికలు పంపాము.. అని తెలిపారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు నష్టపరిహారం విడుదలైందని, మిగతా రైతులకు సంబంధించిన పరిహారం కూడా త్వరలోనే మంజూరవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే లబ్ధిదారులైన రైతులందరికీ వెంటనే అందజేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement