అదుర్స్‌ కుటుంబం | - | Sakshi
Sakshi News home page

అదుర్స్‌ కుటుంబం

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

అదుర్స్‌ కుటుంబం నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నాను నాకు కూడా పవర్‌ పవర్‌ లిప్టింగ్‌లో పాల్గొనాలని ఉండేది అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలన్నదే ధ్యేయం మానసికంగా ఉల్లాసంగా ఉన్నాను

వేంపల్లె: ఆ కుటుంబం బరిలోకి దిగితే పతకాల బోర్డు ఖాళీ అవ్వాల్సిందే.. బరువులు ఎత్తడం మొదలు పెడితే పతకాల పంట పండాల్సిందే. కుటుంబంలోని నలుగురు.. ఒకేసారి ఆరు బంగారు పతకాలతో ఆ ఫ్యామిలీ సరికొత్త చరిత్ర సృష్టించింది. వేంపల్లెలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా, పవర్‌ లిఫ్టింగ్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ బాలగోవింద్‌ తివారీ కుటుంబం రాష్ట్రస్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ఏపీ క్రీడా చరిత్రలో ‘ఫస్ట్‌ ఫ్యామిలీ’ గా నిలిచింది.

ఒకే వేదికపై నలుగురి స్వర్ణ విశ్వరూపం

అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు కేంద్రంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో డాక్టర్‌ బాలగోవింద్‌ తివారీ తన కుటుంబ సభ్యులతో కలిసి బరిలోకి దిగారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తివారీ కుటుంబం స్వర్ణ పతకాల పంట పండించింది.

డాక్టర్‌ బాలగోవింద్‌ తివారీ: సీనియర్‌ విభాగంలో పవర్‌ఫుల్‌ ప్రదర్శనతో బంగారు పతకం కై వసం చేసుకున్నారు.

పూర్ణిమ తివారీ: ఆయన సతీమణి మహిళల విభాగంలో అత్యంత బరువైన వెయిట్లను ఎత్తి స్వర్ణం సాధించారు.

లైనా హర్షిత తివారీ, గర్విత తివారీ: కుమార్తెలిద్దరూ తమ వయస్సు విభాగాలలో తలా రెండు చొప్పున మొత్తం 4 బంగారు పతకాలను కొల్లగొట్టారు.

విజయాల పరంపర.. రికార్డుల వేట

ఒకే రాష్ట్రస్థాయి క్రీడా వేదికపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు పాల్గొని 6 స్వర్ణ పతకాలను సాధించడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. నిజానికి తివారీ కుటుంబానికి పతకాలు కొత్తేమీ కాదు. డాక్టర్‌ బాలగోవింద్‌ తివారీ 2018లోనే ఆసియా ఛాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2024 అక్టోబర్‌లో నిర్వహించిన పోటీల్లో తండ్రి బాలగోవింద్‌, కుమార్తె హర్షిత కాంస్య పతకాలు సాధించారు. అలాగే, 2025 జూన్‌లో జరిగిన మాస్టర్స్‌ నేషనల్స్‌లో బాలగోవింద్‌ ఒక బంగారు, ఒక రజత పతకం సాధించడంతో పాటు ఏకంగా రెండు జాతీయ రికార్డులను తిరగరాశారు.

అభినందనల వెల్లువ..

రాష్ట్రస్థాయిలో ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన డాక్టర్‌ బాలగోవింద్‌ తివారీ కుటుంబ సభ్యులను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు ప్రత్యేకంగా కలిసి ఘనంగా అభినందించారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే వేదికపై పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పతకాలు తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని తివారీ కుటుంబం ధీమా వ్యక్తం చేసింది.

పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడలో నాన్న బాల గోవింద్‌ తివారిని స్ఫూర్తిగా తీసుకొని పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వివిధ విభాగాల్లో పాల్గొన్నాను. నాన్న నేను ఎన్నో పథకాలు సాధించాం. ప్రస్తుతం నేను బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాను. గత అక్టోబర్‌ మూడు, నాలుగు తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని సాధించాను.

– హర్షిత తివారి

ఇంట్లోవాళ్లు పోటీలలో పాల్గొని మంచి పేరు సాధించడం చూసి స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా 9వ తరగతి నుంచి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో పాల్గొంటూ వచ్చాను. ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లిప్టింగ్‌ పోటీలలో బంగారు పతకాలని సాధించాను.

– గర్విత తివారి

2018లో ఆసియా చాంపియన్‌ గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాను. నా భార్య, పిల్లలు కూడా భవిష్యత్తులో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు పవర్‌ లిప్టింగ్‌ పోటీలలో పాల్గొనాలని సూచించాను. వారు అందుకు అంగీకరించి ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లింకింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. – బాల గోవింద తివారి

పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడలో పాల్గొన్నప్పటి నుంచి నేను ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉన్నాను. మా కుటుంబంలో నా భర్త తో పాటు పిల్లలు కూడా పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో వివిధ విభాగాల్లో పాల్గొని విజయం సాధించారు. నా భర్త గత సంవత్సరం నుంచి నాకు పవర్‌ లిఫ్టింగ్‌ లో కోచ్‌ ఇచ్చాడు. వారి స్ఫూర్తితో నేను ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. – పూర్ణిమ తివారి

పవర్‌ లిఫ్టింగ్‌లో నలుగురు (పీ4).. కొల్లగొట్టింది ఆరు బంగారు

పతకాలు ( జీ6)

రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ కోచ్‌ ఫ్యామిలీ విశ్వరూపం

ఏపీ క్రీడా చరిత్రలోనే అరుదైన రికార్డు

AK - P4/G6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement