● వివరాల సేకరణలో ఏపీసీఎస్‌ల సీఈఓలు
● త్వరలో విడుదల కానున్న
ఎన్నికల నోటిఫికేషన్
కడప అగ్రికల్చర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.. 2013లో పీఏసీఎస్‌లకు చివరిసారిగా ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలో తొలిసారి నిర్వహించనున్న ఈ ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాటు చేయాలంటూ సహకార సంఘాల రిజిస్ట్రార్ జిల్లా సహకారశాఖ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సహకారశాఖ అధికారి వెంకటసుబ్బ య్య, పీఏసీఎస్‌ల సీఈఓలు, డీఎల్‌సీఓ, కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి సహకార సమరానికి అన్ని సిద్ధం చేయాలని సూచించారు.
ఓటర్ల జాబితాలకు తుది రూపు...
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులందరికి ఓట్లు ఉండవు. రూ. 300 సభ్యత్వం రుసుం చెల్లించి లావాదేవీలు నిర్వహించే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అన్ని పీఏసీఎస్‌లను డిజిటలైజ్ చేసినందున ప్రతి సభ్యుడు ఆధార్‌కార్డుతో ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. రుణాలు చెల్లించక డిఫాల్టర్ అయిన వారి ఓటు హక్కు నిరాకరిస్తారు. ఏపీ సహకార సంఘాల చట్టం 1064 ప్రకారం సభ్యుత్వం నమోదు, ఓటర్ల అర్హతలు, అనర్హతలను నిర్దేశిస్తారు. పీఏసీఎస్‌ల వారీగా సభ్యత్వ వివరాలు ధ్రువీకరించి అర్హులైన ఓటర్లు తుది జాబితా సిద్ధం చేయాల్సి ఉంది.
జిల్లాలో 58 సహకార సంఘాలు..
జిల్లావ్యాప్తంగా 59 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతిసంఘాలు ఉన్నాయి, ఇందులో కడప నియోజకవర్గంలో 2, బద్వేల్‌లో 7, మైదుకూరులో 6, జమ్మలమడుగులో 8, ప్రొద్దుటూరులో 3, కమలాపురంలో 12, పులివెందులలో 11, రాజంపేటలో 9 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 99,796 మంది సభ్యులుగా ఉన్నారు.


