ఏజెంట్‌ వైఎస్‌.. ఓటర్‌ ఓఎస్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ వైఎస్‌.. ఓటర్‌ ఓఎస్‌ !

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

● 70 బూత్‌లలో ఏజెంట్లు లేకున్నా పులివెందులలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ●టీడీపీ రౌడీమూకల రచ్చ, రిగ్గింగుల’ లను తిప్పికొట్టిన ప్రజాబలం ● ఎన్నికలేవైనా పులివెందుల ఓటర్లంతా ఏకపక్షమే

సాక్షి కడప: పులివెందుల గడ్డపై ఎన్నిక ఏదైనా... ఫలితం ఎప్పుడూ ఏకపక్షమే! అధికార మదంతో ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూసినా, టీడీపీ నాయకులు రౌడీ మూకలు, ముఠా నాయకులను ప్రయోగించి భయోత్పాతం సృష్టించినా, ఆ బెదిరింపులకు పులివెందుల ప్రజానీకం ఎన్నడూ తలొగ్గలేదు. కొండంత గుండైధెర్యంతో వైఎస్సార్‌సీపీ వెంటే నిలబడ్డారు. ఒకపక్క టీడీపీ మూకలు కట్టెలు, రాడ్లు, రాళ్లతో తెగబడి పోలింగ్‌ బూత్‌ల బయట యుద్ధ వాతావరణాన్ని సృష్టించినా.. లోపలికి వెళ్లిన ఓటరు మాత్రం వైఎస్సార్‌ కుటుంబం పట్ల తమకున్న అచంచలమైన విధేయతను చాటుకుంటూ ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేసి అండగా నిలిచారు. ఇటీవల జరిగిన పులివెందుల మున్సిపాలిటీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు సజీవ సాక్ష్యం.

దశాబ్దాల చరిత్ర.. పెట్టని కోట!

పులివెందుల నియోజకవర్గంలో ఎన్నిక ఏదైనా, ప్రతిసారి వైఎస్‌ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థికి ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆదరణ కాదు.. 1978 నుంచి దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వైఎస్‌ కుటుంబానికి పులివెందుల గడ్డ పెట్టని కోట గోడగా నిలిచింది. లోక్‌సభ, అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి నిన్నమొన్నటి మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వరకు ఏది వచ్చినా ఆ కుటుంబం పట్ల తమకున్న అచంచలమైన అభిమానాన్ని ఓటర్లు చాటుకుంటూనే ఉన్నారు. ఎన్ని రాజకీయ ముసుర్లు కమ్ముకున్నా, పులివెందుల ఎప్పటికీ వైఎస్‌ కుటుంబానికి తిరుగులేని కంచుకోట అని ప్రజలు ప్రతి ఎన్నికలోనూ నిరూపిస్తున్నారు.

70 బూత్‌లలో ఏజెంట్లు లేకున్నా..

పులివెందుల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానానికి సంబంధించి మొత్తం 80 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, అందులో ఏకంగా 70 బూత్‌లలో వైఎస్సార్‌సీపీ తరపున కనీసం ఏజెంట్లు, పార్టీ శ్రేణులు రాకుండా టీడీపీ గూండాలు, రౌడీలు అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో బూతులను టీడీపీ మూకలు ముఠాగా ఏర్పడి ఆక్రమించి, దొంగ ఓట్లు, రిగ్గింగ్‌లతో చెలరేగిపోయాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఎన్నికల పోలింగ్‌ ముగిసే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తూ వచ్చిన విజ్ఞులైన ఓటర్లు, పోలింగ్‌ రోజున తమ విజ్ఞతతో ఆందోళనల నడుమే ఓటేశారు. కనీసం ఏజెంట్లు కూడా లేని ఆ 70 బూత్‌లలో వైఎస్సార్‌సీపీకి ఏకంగా 11,559 ఓట్లు వచ్చాయంటే అక్కడ వైఎస్సార్‌ కుటుంబంపై ప్రజలకున్న అచంచలమైన నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అక్కడో ఇక్కడో సాధారణంగా జరిగిన ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే, ఓటర్లంతా పూర్తిగా వైఎస్సార్‌ సీపీకే ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది.

లింగాల అరాచకాలను దాటుకుని.. మున్సిపల్‌ ఎన్నికల్లోనే కాకుండా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటర్లు పూర్తి స్థాయిలో వైఎస్సార్‌ సీపీ వైపే ఉన్నట్లు స్పష్టంగా రూఢీ అయింది. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట లాంటి లింగాల మండలంలోని ఇప్పట్ల, పార్నపల్లి, కోమన్నూతల, కామసముద్రం తదితర ప్రాంతాల్లో టీడీపీ రౌడీలు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అయినప్పటికీ ఈ మండలంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి 3,304 ఓట్ల ఆధిక్యత లభించింది. టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో రిగ్గింగ్‌కు పాల్పడి 10,147 ఓట్లు సాధించినా, ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్సార్‌ సీపీకి 8,598 ఓట్లు వేసి తమ అఖండ మద్దతును చాటారు. సాధారణంగా, ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగిన ప్రతిచోటా ఓటర్లు ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీకే జైకొట్టారు.

వేములలో గుండాల రచ్చ..

ఇక వేముల మండలంలోనూ టీడీపీ గుండాలు ఇదే రీతిలో రచ్చ లేపారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను అడ్డుకోవడం, బూత్‌ల వద్ద దౌర్జన్యాలకు తెగబడటమే కాకుండా, మండల కేంద్రమైన వేములలో పోలింగ్‌ కేంద్రం వైపు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు రాకుండా రోడ్లపైనే అరాచకాలు సృష్టించారు. ఒక్క వేములలోనే కాకుండా కొత్తపల్లి, చాగలేరు వంటి పలు గ్రామాల్లో అరాచకాలు సాగించినా ఓటర్లు మాత్రం వైఎస్సార్‌ సీపీకి తిరుగులేని ఆధిక్యతను అందించారు. ఈ మండలంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి 9,047 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు చేసుకున్నా కేవలం 7,478 ఓట్లకే పరిమితం కావడం ప్రత్యర్థుల నైతిక ఓటమికి నిదర్శనం.

వేంపల్లెలో క్లీన్‌ స్వీప్‌..

ఎలాంటి అరాచకాలు లేకుండా సాధారణంగా, ప్రశాంత వాతావరణంలో జరిగిన వేంపల్లె ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి ఓటర్లు తిరుగులేని, చరిత్రాత్మక మెజార్టీని అందించారు. ఇక్కడ జనసేన, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీని, వచ్చిన మెజార్టీలను పరిశీలిస్తే ఇరు పార్టీల బలాబలాలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాము స్వచ్ఛందంగా గెలవలేమనే ముందస్తు భయంతోనే టీడీపీ మూకలు ఈ స్థాయి అరాచకాలకు ఒడిగట్టాయని ఇక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇంత దౌర్జన్యాలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రజాదరణను సాధించలేకపోవడం, నైతికంగా ఓడిపోవడంపై ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలన్నింటినీ పులివెందుల ఓటరు మహాశయులు తమ ఓటు అనే ఆయుధంతో నిలువునా తిప్పికొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement