● జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం
● నవంబర్ 20 లోగా
ప్రక్రియ పూర్తి కావాలి
● జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్
కడప సెవెన్‌రోడ్స్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు చేరని అర్హులైన పౌరులకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మరో అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. గైర్హాజరు, నివాసం మారడం, మరణం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి కారణాల వల్ల జాబితాలో చేరని వారి వివరాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పురపాలక కార్యాలయాలతో పాటు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్లకు చేరనున్న నమోదు పత్రాలు
ముసాయిదాలో పేరు లేని సంబంధిత ఓటర్లకు బూత్ స్థాయి అధికారులు నేరుగా నమోదు పత్రాలను అందజేస్తారని కలెక్టర్ వివరించారు. ఓటర్లకు అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్లకు వాట్సాప్, సాధారణ సందేశాల ద్వారా కూడా వీటిని పంపిస్తామన్నారు. ఓటర్లు తమ పాత ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ఆధారంగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లేదా ఈసీఐనెట్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అనుబంధ పత్రాల సమర్పణ ఇలా..
ఇంతకుముందు నివాసం మారని వారు: నమోదు పత్రంతో పాటు, గతంలో ఓటరు సవరణ సమయంలో వివరాలను ఎందుకు సమర్పించలేకపోయారో తగిన కారణాన్ని తెలియజేస్తూ అనుబంధం బి ప్రకటన పత్రాన్ని జతచేసి అందజేయాలి.
రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి
నివాసం మారిన వారు:
కొత్తగా నివాసం మారిన వారు తమ కొత్త చిరునామా వివరాలతో కూడిన అనుబంధం–సి ప్రకటనను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, వీరు ప్రత్యేకంగా ఫారమ్–8 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కొత్తగా దరఖాస్తు చేసిన వారికి మినహాయింపు
ఇప్పటికే కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారమ్ 6 సమర్పించిన వారు మళ్లీ నమోదు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి పేర్లను తుది ఓటరు జాబితాలో చేరుస్తారని తెలిపారు.
నిరాశ్రయులకు ప్రాధాన్యత
చిరునామా ఆధార పత్రాలు లేని నిరాశ్రయులకు బూత్ స్థాయి అధికారి పరిశీలన నివేదిక ఆధారంగా నివాస ధ్రువీకరణ కల్పిస్తారని కలెక్టర్ పేర్కొ న్నారు. నిరాశ్రయులు, ఇతర కారణాలతో అందుబాటులో లేని ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఒకరి పేరు రెండుసార్లు నమోదు కాకుండాజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సవరణ ప్రక్రియను నవంబర్ 20లోగా పూర్తి చే యాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.


