● మిట్టపాలెంలో మొక్కు తీర్చుకుని వస్తుండగా వెంటాడిన మృత్యువు
● పండుగ పూట కడప జిల్లా
ఐతారంపేటలో తీరని విషాదం
సీఎస్‌పురం (పామూరు) : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మండల కేంద్రమైన సీఎస్‌పురం సమీపంలోని ఉప్పలపాడు జంక్షన్ వద్ద 167బి మైదుకూరు–సింగరాయకొండ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా బి.కోడూరు మండలం ఐతారంపేట గ్రామానికి చెందిన కొండా వెంకట సుబ్బారెడ్డి (22), ఆయన బంధువు కుక్కలరెడ్డి సిద్దారెడ్డి (68) దీపావళి సందర్భంగా సీఎస్‌పురం మండలం మిట్టపాలెంలోని శ్రీ నారాయణస్వామి ఆలయానికి వచ్చారు. పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్న అనంతరం బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఉప్పలపాడు జంక్షన్ వద్దకు రాగానే, సీఎస్‌పురం వైపు నుంచి వేగంగా వస్తున్న పాశం వెంకటేశ్వర్లు బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట సుబ్బారెడ్డి తల, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న సిద్దారెడ్డి కాలు విరిగి తీవ్ర గాయాలపాలవగా, మరో బైక్‌పై ఉన్న వెంకటేశ్వర్లు కూడా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తరలించారు. కనిగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్దారెడ్డి సాయంత్రం మృతిచెందగా, వెంకటేశ్వర్లును మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మృతుడి బంధువు లక్కిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేతికందివచ్చిన కొడుకు అనంతలోకాలకు..
మృతుడు వెంకట సుబ్బారెడ్డి మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. ఆయన సోదరుడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పండుగ పూట దైవదర్శనానికి వెళ్లిన చేతికందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనిగిరి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
బి.కోడూరు : మండలంలోని ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి (23), కుక్కల్‌రెడ్డి సిద్దారెడ్డి (68) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఐత్రంపేట గ్రామాన్ని సందర్శించి, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ౖఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఐత్రంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్సీ వెంట నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, కాశినాయన మండల మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి, బి.కోడూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రమణారెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


