● పాత ఇనుప సామాన్ల దుకాణంలో వాహనం స్వాధీనం
ఖాజీపేట : మనం ప్రతి రోజు ఇంటి ముందు ద్విచక్రవాహనాలు, కారు లేక ఇతర పెద్ద వాహనాలు పార్కింగ్ చేస్తుంటాం. వాటిని లాక్ చేశాం కాబట్టి సురక్షితంగా ఉంటాయని భావిస్తాం.. కానీ కొందరు దొంగలు ఎంతో తెలివిగా ఆన్‌లాక్ చేసి క్షణాల్లో చోరీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటలు ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామంలోని సర్వర్‌ఖాన్‌పేటలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యస్‌దాన్ అనే వ్యక్తికి మినీ లారీ ఉంది. ఈ వాహనాన్ని ఇంటి వద్దనే ఉంచారు. ఐదు రోజుల కిందట కనిపించలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు ఖాజీపేట పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కడప నగర పరిధిలోని ఆలాంఖాన్‌పల్లెలో ఒక పాత ఇనుప సామన్లు అమ్మే దుకాణంలో మినీ లారీ కనిపించింది. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
రూ.50 వేలకే విక్రయం
మినీ లారీని గుర్తించిన వ్యక్తులు పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తిని గట్టిగా నిలదీశారు. రూ.50 వేలకు సర్వర్‌ఖాన్‌పేటకు చెందిన వ్యక్తి అమ్మినట్లు చెప్పారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు విలువ చేసే దాన్ని 50 వేలకు ఎలా కొంటావు.. ఇది చోరీకి చేసిన వాహనంగా తెలియదా అంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చారు.
మరో వాహనం మాయం
సర్వర్‌ఖాన్‌పేటలోనే ఆటో బుధవారం మాయం అయ్యింది. ఇది కూడా చోరీ అయినట్లు స్థానికులు గుర్తించారు. దీనిపై ఆరా తీయగా సర్వర్‌ఖాన్‌పేటకు చెందిన వ్యక్తే చోరీ చేసి అమ్మినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాల దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
పూర్తి స్థాయి విచారణ జరగేనా
చోరీ చేసిన వాహనాలను కొంటున్న వ్యాపారుల నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరికొన్ని వాహనాలు బయటికి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. చోరీకి పాల్పడుతున్న దొంగలు సైతం బయట పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అలాగే సర్వర్‌ఖాన్‌పేటకు చెందిన వాహనాల దొంగను పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరికొన్ని వాహనాల గుట్టు రట్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, వాహనాల చోరీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.


