● రైతులకు రాయితీపై పంపిణీ!
● వీడ్‌మ్యాట్‌తో శాశ్వత చెక్
● తగ్గనున్న కూలీల పెట్టుబడి ఖర్చు
● తేమ ఆవిరి కాకుండా రక్షణ
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భానుడి భగభగలకు భూమిలోని తేమ ఆవిరైపోతోంది. ఈ వేడి దెబ్బకు దీర్ఘకాలిక ఫలసాయం ఇవ్వాల్సిన పండ్ల తోటలు వాడుముఖం పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి ‘వీడ్‌మ్యాట్’ అద్భుత రక్షణ కవచంగా పనిచేస్తుందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. గతంలో వాడిన ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిసి భూతాపం పెరుగుతుండటంతో, దానికి భిన్నంగా వీడ్‌మ్యాట్ బహుళ ప్రయోజనాలను ఇస్తోంది.
కలుపునకు అడ్డుకట్ట..
కూలీల ఖర్చు విముక్తి
వీడ్‌మ్యాట్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులకు తమ పండ్లతోటల్లో నిరంతరం వేధించే కలుపు సమస్యకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల కలుపు తొలగింపునకు ప్రతి ఏటా అయ్యే పెట్టుబడి ఖర్చుతో పాటు కూలీల కొరత, వారి ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. మొక్కల చుట్టూ కలుపు లేకపోవడం వల్ల నేలలోని పోషకాలు, తేమ వృథా కాకుండా పూర్తిగా చెట్లకే అందుతాయి. ఈ మ్యాట్ ప్రత్యేక ఆకృతి వల్ల గాలి, నీరు, వెలుతురు నేలలోకి సులభంగా చేరేందుకు దోహదపడుతుంది.
బెట్ట పరిస్థితుల నుంచి రక్షణ..
డ్రిప్ పైపుల అమరిక
ఈ వీడ్‌మ్యాట్ భూమిలో నీటి తడి ఆరకుండా చేయడంతోపాటు చెట్లను తీవ్ర ఎండల వల్ల వచ్చే బెట్ట పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. చెట్ల కింద నేలపై ఈ షీట్ పరిచినప్పుడు బిందు సేద్యం (డ్రిప్) పైపులను మ్యాట్ కిందనే ఉంచుతారు. దీనివల్ల బలమైన ఈదురుగాలులు వీచినా పైపులకు ఎలాంటి సమస్య ఉండదు. వీడ్‌మ్యాట్ పరిచిన తర్వాత దాని చుట్టూ మట్టిని వేసి గాలికి ఎగిరిపోకుండా లాక్ చేయాలి. దీనివల్ల మ్యాట్ కింద ఉన్న నెమ్ము (తేమ) సుదీర్ఘకాలం అలాగే ఉండి, మొక్కకు కావాల్సినంత తేమ శాతం నిరంతరం అందుతుంది. ఫలితంగా తోటలు ఏపుగా, పచ్చగా పెరగడమే కాకుండా రైతులకు మంచి దిగుబడులను ఇస్తాయి.
50 శాతం రాయితీ..
గరిష్టంగా రూ. 50 వేల లబ్ధి
జిల్లా ఉద్యానశాఖ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు ఉద్యానశాఖ అందించే వీడ్‌మ్యాట్‌కు ఒక చదరపు మీటర్‌కు రూ.25 చొప్పున ఖర్చు కాగా, అందులో రూ.12.50 (50 శాతం) ప్రభుత్వం రాయితీగా ఇస్తోందని తెలిపారు. ఒక్కో మొక్కకు 2 x2 మీటర్ల చొప్పున పండ్లతోటల రకం, వయసును బట్టి మొక్క పాదుల్లో దీనిని పరచాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 4 వేల చదరపు మీటర్లకు మించకుండా గరిష్టంగా రూ. 50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. ఈ షీట్ మందాన్ని బట్టి 3 నుంచి 5 సంవత్సరాల వరకు అద్భుతమైన మన్నిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సాంకేతికత కావాల్సిన తోటల రైతులు తక్షణమే తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల సిబ్బందిని లేదా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.


