ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు మున్సిపల్ చైర్మన్ అయ్యే అర్హత లేదా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ పదవిని ఓసీలకు ఇవ్వాలని పురుపాలక శాఖ మంత్రి పి.నారాయణకు రాసిన లేఖను ఎమ్మెల్యే రాచమల్లు సోమవారం బయటపెట్టారు. ఈ సందర్భంగా రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చెప్పిందన్నారు. బీసీలకు అన్యాయం చేసి వరద కేవలం తన కుటుంబ సభ్యులకు చైర్మన్ పదవిని ఇప్పించేందుకు ఇలా చేయడం అన్యాయమన్నారు. తన తమ్ముడి కోసం స్వార్థంతో చైర్మన్ పదవి బీసీలకు రాకుండా అడ్డుకున్నారన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే రాసిన లేఖ వల్ల బీసీలు చైర్మన్ స్థానాన్ని కోల్పోయారని తెలిపారు. ఎమ్మెల్యే వరద పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణకు సెప్టెంబర్ 9న రాసిన లేఖను విలేకరులకు రాచమల్లు చూపించారు. ఇప్పటికై నా బీసీలు కళ్లు తెరవాలని కోరారు. గతంలోనే కలర్ బువ్వ, రంగునీళ్లు అని విమర్శించిన వరద కుటుంబం ఇలాంటి అన్యాయానికి పాల్పడిందన్నారు. బీసీలు పల్లకీ మోసేందుకు మాత్రమే పనికి వస్తారా.. పీఠం ఎక్కడానికి పనికిరారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి స్వయంగా తన దస్తూరితో ఈ లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సిఫారసును పరిగణలోకి తీసుకుని టీడీపీ ప్రభుత్వం ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రాఘవరెడ్డికి కేటాయించిందన్నారు. వాస్తవానికి టీడీపీ నాయకుడు భూమిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి సైతం చైర్మన్ సీటు కోసం ప్రయత్నించినా ఇవ్వలేదన్నారు. 85 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే, 82 ఏళ్ల వయసులో మున్సిపల్ చైర్మన్ ఉండగా అన్నాదమ్ములు పరిపాలన సాగిస్తున్నారన్నారు.
ఓటే లేని రాఘవరెడ్డి చైర్మన్ అయ్యాడు
వాస్తవానికి ఎమ్మెల్యే వరద సోదరుడు రాఘవరెడ్డికి మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసే అర్హతే లేదని, ఆయన కామనూరు గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉన్నారని రాచమల్లు తెలిపారు. సర్ ప్రక్రియలో ఆయన తన పేరును నమోదు చేసుకున్నారని, ఆన్‌లైన్ వరకు వచ్చిందన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రచురించిన మున్సిపల్ ఓటరు జాబితాలో ఆయన పేరు లేదన్నారు. గత నెల 15వ తేదీ వరకు రాఘవరెడ్డికి ఓటు హక్కు లేదని చెప్పిన అధికారులు 17వ తేదీకి ఓటు హక్కు ఉందని నిర్ధారించారన్నారు.
ఇందు కోసం రూ.6కోట్లుపైగా విలువైన స్థలాన్ని హైదరాబాద్ పరిఽధిలోని నార్సింగ్‌లో పెద్ద అధికారికి ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోటీ చేస్తే తమ విజయం కష్టం అవుతుందన్న కారణంతో పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా, వేసిన వారిని స్క్రూటినీకి వెళ్లకుండా దాడి చేశారన్నారు. నిబంధనల ప్రకారం పోటీ చేసి ఎందుకు గెలవలేకపోయారన్నారు.సమావేశంలో మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, తొగటవీర క్షత్రియ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, మాజీ కౌన్సిలర్లు పిట్టా భద్రమ్మ, వుట్టి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


