కడప అర్బన్ : కుమార్తె కాపురం చక్కదిద్దాలని చూసిన ఓ మామపై అల్లుడు, అతని బంధువులు అల్లరి మూకలతో కలిసి ఇనుప రాడ్లతో ఘాతుకానికి ఒడిగట్టారు. చనిపోయాడని భావించి వదిలేసి వెళ్లిన ఘటన కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. కడపలోని అల్మాస్‌పేటకు చెందిన దౌజీ జమీల్ ఖాన్(58) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తెకు, అల్లుడికి మధ్య ఉన్న కుటుంబ సమస్య ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు వాయిదాలకు వెళ్లిన సమయంలో అల్లుడు ఫైరోజ్ ఖాన్, అతని తండ్రి శర్వాణి షబ్బీర్ ఖాన్, బావ యూసఫ్‌లు జమీల్ ఖాన్‌ను చంపుతామని పలుమార్లు బెదిరించారు. ఈ క్రమంలోనే, అక్టోబరు 29న తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జమీల్ ఖాన్ నమాజు కోసం మసీదుకు వెళ్తుండగా నిందితులు అల్లరి మూకలతో కాపుకాశారు. ఆయనపై ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తగాయాలతో జమీల్ ఖాన్ కింద పడిపోవడంతో, చనిపోయాడని భావించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ కోల్పోయిన బాధితుడిని స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించారు. ‘నా కుమార్తె కాపురం బాగుపడాలని నేను ఆరాటపడుతుంటే, వారు నన్ను చంపాలని చూశారు‘ అని బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కడప టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఎర్రచందనం పట్టివేత
చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె సమీపంలో సోమవారం ఎర్రచందనం తరలిస్తున్న గండ్లు లతీఫ్ బాషా అలియాస్ నల్లోడు అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీకి చెందిన లతీఫ్ ఏపీ 32 బి 6666 నంబర్ గల కారులో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుండగా అందిన సమాచారం మేరకు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. నిందితుడిని పట్టుకుని తిరుపతి ఆర్‌ఎస్ కోర్టుకు పంపించారు. ఈ ఘటనలో పారిపోయిన దొంగల కోసం విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.


