వైఎస్‌ఆర్‌సీపీ నామినేషన్ల తిరస్కరణ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ నామినేషన్ల తిరస్కరణ అన్యాయం

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసిన నంద్యాల రాఘవరెడ్డి మాత్రమే చదువుకున్నారా, మిగతా వారికి చదువురాకనే వారి నామినేషన్లు చెల్లుబాటు కాలేదా అని ప్రశ్నించారు. 52 కౌన్సిలర్‌ స్థానాలకు సంబంధించి మొత్తం 219 మంది నామినేషన్లు వేసినా టీడీపీ అభ్యర్థులు మినహా ఎవరి నామినేషన్లు చెల్లుబాటు కాలేదన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 1,37,202 మంది ఓటర్లు ఉండగా ఎవరూ ఓటు వేయకపోయినా.. నంద్యాల రాఘవరెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా, 52 మంది టీడీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం జిల్లాలోనే పెద్దదని, ఈ సంఘం 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చైర్మన్‌, మొత్తం కౌన్సిలర్‌ స్థానాలు ఏకగ్రీవం కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ దండోపాయాన్ని ఉపయోగించి ఏకగ్రీవం చేసుకోవడం దారుణమన్నారు. పదవుల కోసం ఇంత అన్యాయానికి పాల్పడటం తగదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎమ్మెల్యే వరద కుటుంబ సభ్యులు అవమాన పరిచారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అవమానాలకు గురైనా తమ పార్టీ కార్యకర్తలు మాత్రం పోటీకి వచ్చారన్నారు. తమ పార్టీకి సంబంధించిన మహిళలను నామినేషన్ల సందర్భంగా ఘోరంగా అవమానించారన్నారు. స్క్రూటినీ సందర్భంగా రాక్షస క్రీడ జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రైవేట్‌ సైన్యంతో దాడులు చేయించిందన్నారు. నామినేషన్ల పత్రాలు నోరుమూసుకుని ఇస్తే తీసుకుంటాం.. లేకుంటే తన్నులు తింటారని బెదిరించారన్నారు. పోలీసుల కళ్ల ముందే తమను అవమానించడం జరిగిందన్నారు. తమ అభ్యర్థులను కొడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సేమ్‌ సీన్‌

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్‌ ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయిందని తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తమ పార్టీ అభ్యర్థులను బెదిరించడం, పత్రాలు చించివేయడం జరిగిందన్నారు. రాజుపాళెంలో ముగ్గురు, ప్రొద్దుటూరులో ఏడుగురు మాత్రమే నామినేషన్‌ వేయగలిగారన్నారు. వీటిని కూడా స్క్రూటినీలో టీడీపీ నేతలు చించే అవకాశం ఉందన్నారు. రాఘవరెడ్డి కుమారుడు రవిరెడ్డి, మరికొందరు టీడీపీ నేతలు అక్కడే మకాం వేసి అభ్యర్థులను లోపలికి పంపకుండా చేశారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. 2029లో ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement