రాజంపేట : రాజంపేట మున్సిపాలిటీ నామినేషన్ల పర్వంలో దాడికి దిగిన పచ్చమూకలపై కాకుండా.. బాధిత పక్షంలో ఉన్న 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ రోజున వందలాది మంది టీడీపీ గుండాలు, గంజాయి బ్యాచ్‌లు, పచ్చమూకలు మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి స్వగృహం(ఆకేపాటి భవన్)పై దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనను వదిలేసి, బాధితులుగా ఉన్న వారిపై పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజాస్వామ్యవాదులు ఎద్దేవా చేస్తున్నారు. స్థానికేతరుడు వీరబల్లికి చెందిన దేవందర్‌రాజు పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా వీరబల్లి నివాసి రాజంపేట పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌లో ఉన్నట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో చూపించడం గమనార్హం. టీడీపీ ముఖ్యనేత ఒత్తడి వల్లే ఈ కేసు నమోదు చేసినట్లుగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులో ఏమీ సంబంధం లేని వారి పేర్లు కనిపించడంతో పలువురు విస్మయానికి గురయ్యారు. రాజంపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌రెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, దండుగోపి, రమేష్‌నాయుడు, గొంటుమణి, గీతాల నరసింహారెడ్డి, జావిద్, యాసిన్, మిరియాల సురేఖ, నందలూరు పార్టీ కన్వీనరు గోపిరెడ్డి, అక్కడి నాయకులు అరిగెల సౌమిత్రి, ఆకేపాటి జగదీశ్వరరెడ్డి, గుండు మల్లికార్జునరెడ్డి (గాయపడ్డ వ్యక్తి), నడివీధి సుధాకర్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు. 191(2), 191(3),118(1), 109(1) హత్యాయత్నం కేసు, మరణాయుధాలతో దాడి చేసినట్లు మున్సిపాలిటీకి ఏ మాత్రం సంబంధం లేదని వీరబల్లి నివాసి ఫిర్యాదు ఇవ్వడంతో నమోదు చేయడం గమనార్హం.
దాడికి పాల్పడిన పచ్చ
మూకలను వదిలేసిన పోలీసులు
వీరబల్లి నివాసి ఫిర్యాదుతో నమోదు


