కలసపాడులో కర్రలతో హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

కలసపాడులో కర్రలతో హల్‌చల్‌

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

కలసపాడులో కర్రలతో హల్‌చల్‌

కలసపాడు : నామినేషన్ల పర్వం చివరి రోజు కలసపాడు నామినేషన్‌ కేంద్రం వద్ద రణరంగంగా మారింది. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను టీడీపీ మూకలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారికి ఎదురొడ్డి నిలిచి 9 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 స్థానాలకు నామినేషన్లు వేశారు. శుక్రవారం ఉదయం నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను టీడీపీ నాయకులు అడ్డుకోగా.. మధ్యాహ్నం మరోసారి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరారు. క్యూలో ఉన్న అభ్యర్థులపై టీడీపీ మూకలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడగా సింగరాయపల్లెకు చెందిన యంబడిబేబీ తల పగిలి రక్తగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన అంబులెన్స్‌లో పోరుమామిళ్లకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. రాళ్ల దాడులను, కర్రల దాడులను తట్టుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నిలబడగా వారికి మద్దతుగా దేవసాని ఆదిత్యరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు నిలిచారు. ఘర్షణ తీవ్రతరం కావడంతో ఎస్‌ఐ హనుమంతు పోరుమామిళ్ల సీఐ సుబ్రమణ్యంకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు భారీగా చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి నామినేషన్‌ కేంద్రం వద్ద ఉన్న అభ్యర్థులను పరిశీలించి లోనికి పంపించారు. టీడీపీ గూండాలు బరితెగించి మూడు రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసినప్పటికీ మొక్కవోని ధైర్యంతో 9 స్థానాలకు గాను 7 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు. శుక్రవారం టీడీపీకి 8 నామినేషన్లు దాఖలు కాగా వైఎస్సార్‌సీపీ 12, జనసేన 2, ఒక ఇండిపెండెంట్‌ మొత్తం 23 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజులు జరిగిన నామినేషన్ల పర్వంలో మొత్తం 46 నామినేషన్లు దాఖలు కాగా 25 టీడీపీ నుంచి, 12 వైఎస్సార్‌సీపీ నుంచి, 4 వైఎస్సార్‌సీపీ పేరుతో టీడీపీ అభ్యర్థులు ఫేక్‌ నామినేషన్లు వేశారు. జనసేన 2, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement