చాపాడు : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిని మూడో రోజు శుక్రవారం కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్లు జరిగిన మూడు రోజులపాటు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎంపీపీ లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, పల్లవోలు ఎంపీటీసీ అభ్యర్థులైన మహేష్‌యాదవ్, దోనాది సాగర్, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, దళిత నాయకులు మొర్రాయిపల్లెకు చెందిన బాలయ్య, బద్రిపల్లెకు చెందిన పుల్లయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. మూడు రోజులపాటు తమను పోలీస్‌స్టేషన్‌కు పరిమితం చేయడంతో నామినేషన్లు వేయలేకపోయామని అభ్యర్థులు వాపోయారు.
వీరబల్లి : మండల కేంద్రంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వీరబల్లి మండల కేంద్రంలో వీరబల్లి ఎంపీటీసీ స్థానానికి చింతమాను రెడ్డయ్య తల్లి లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇది గమనించిన టీడీపీ గూండాలు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర మహించడం గమనార్హం.
మైదుకూరు : మైదుకూరులో మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం డీఐజీ కోయ ప్రవీణ్, ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు గణేష్ పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయం గేట్ వద్ద డీఐజీ కోయ ప్రవీణ్ నామినేషన్ల దాఖలుపై మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను రాష్ట్ర పరిశీలకుడు గణేష్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అంతకుముందు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
భద్రత కట్టుదిట్టం
కడప అర్బన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసిందని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడక్కడా చిన్న ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.


