కడప కార్పొరేషన్ : మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణులు దాష్టీకానికి పాల్పడ్డారని అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, వ్యవస్థలన్నీ వారి చెప్పుచేతల్లో పెట్టుకొని అరాచకం సృష్టించారన్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను గృహ నిర్బంధాలు చేశారని, టీడీపీ అల్లరిమూకలు నామినేషన్ కేంద్రాల వద్ద తిష్ట వేసి నామినేషన్ వేసేందుకు వచ్చేవారి వద్ద నుంచి పత్రాలు లాక్కొని చించేశారన్నారు. రాజంపేటలో ఇద్దరు చైర్మన్, ఆరుగురు కౌన్సిలర్ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు వేశారన్నారు. అందులో ఒక చైర్మన్ అభ్యర్థిది ముందే తిరస్కరించారని, మరొకరి నామినేషన్ సరిగ్గా ఉందని చెప్పి, 2 గంటల తర్వాత ఇంటి పన్ను సరిగా లేదని అది కూడా తిరస్కరించారన్నారు. అధికారులు మొదట అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని, సెల్‌ఫోన్‌లు లాక్కొని వాటిని బలవంతంగా తొలగించారన్నారు. 144 సెక్షన్, 30 యాక్టు వైఎస్సార్‌సీపీకే అమలు చేశారని, దీనిపై ఎస్పీ, డీఎస్పీ, సబ్ కలెక్టర్ ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాంటప్పుడు ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఉన్న ఇంటిపై దాడి చేస్తే పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారన్నారు. తన ఇంటిపై వారు దాడి చేసినా తనపైనే కేసు పెట్టారని, ఈ పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం లేకనే తాను ఫిర్యాదు చేయలేదన్నారు. 2029లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
వీళ్లు ఎలా ఐపీఎస్‌లు అయ్యారో
తెలియడం లేదు : రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రజలకు భద్రత కల్పించలేని వారు ఎలా ఐపీఎస్‌లు అయ్యారో తెలియడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. నామినేషన్లు వేసేటప్పుడు ఏం చేయాలి, ఎవరి నామినేషన్లు ఉంచాలి, ఎవరి నామినేషన్లు తీసేయాలి, అని పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో అన్ని నామినేషన్లు తిరస్కరించారని, కడపలో మేయర్ అభ్యర్థి నామినేషన్ తప్ప అన్ని తిరస్కరించారన్నారు. వీటిని ఎన్నికలు అంటారా అని ప్రశ్నించారు. కొత్త తరం రాజకీయ నాయకులకు మీరు నేర్పించేది ఇదేనా అని నిలదీశారు. పులివెందులలో 550 మందిపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బాష్పవాయువు ప్రయోగించి, కాల్పులు జరిపి బాధితులపైనే కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కొట్టి, కత్తులతో పొడిచినా, నామినేషన్ పత్రాలు చించినా టీడీపీ వాళ్లపై కేసులు పెట్టరా.. మాపైనే పెడతారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలెవరూ నిరుత్సాహానికి గురికావాల్సిన పనిలేదని, 2029లో మన సత్తా ఏంటో చూపిద్దామని తెలిపారు.
డబ్బు కోసమే మేయర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించలేదు : అంజద్‌బాషా
మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైతే డబ్బులు చేతికి రావనే వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించలేదని, వచ్చి ఉంటే దాన్ని కూడా తిరస్కరించే వారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆరోపించారు. నామినేషన్ల స్క్రూట్నీకి ముందే 66 సీట్లు ఏకగ్రీవంగా గెలిచామని ఎమ్మెల్యే మాధవి చెబుతూ.. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకోవడం సిగ్గుచేటన్నారు. కడపలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, పోలీసులు రక్షక భటుల్లా కాకుండా భక్షక భటుల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. 2021 ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అన్ని పార్టీల వాళ్లు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారన్నారు. టీడీపీ వాళ్లు డబ్బుకు అమ్ముడుపోవడం వల్లే ఏకగ్రీవాలు అయ్యాయే తప్ప మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు సవ్యంగా జరిగాయన్నారు. 1వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతుల శివారెడ్డి కారును ధ్వంసం చేశారని, 33వ డివిజన్ ఓసీ మహిళకు రిజర్వ్ అయినా, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని తిరస్కరిస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిసునీల్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్, శ్రీరంజన్‌రెడ్డి, త్యాగరాజు పాల్గొన్నారు.
నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం
అధికార మదంతో రెచ్చిపోయిన పచ్చమూకలు
వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం
అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి


