● మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి
మైదుకూరు : ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదని గుర్తించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు, పోలీసుల అండతో దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే కొత్త సంప్రదాయానికి ఎమ్మెల్యే పుట్టా తెరలేపారని ఆరోపించారు. మైదుకూరు చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. ఎన్నో పార్టీలు, నాయకులు అధికారంలో ఉన్నా ఇక్కడ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. ఇలాంటి సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తే ప్రజలు సహించరని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న వారే నాయకులు కావాలి కానీ పోలీసులు, అధికారుల అండదండలతో డిక్లేర్ చేసుకుని గెలిస్తే ఇక ప్రజాస్వామ్యం అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ అదే చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం
అభినందనీయం
మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిలిపివేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల కమిషన్ విలువ పోతుందన్నారు. పోలీసులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎమ్మెల్యేను నామినేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్న మున్సిపల్ కార్యాలయానికి పంపించడం శోచనీయమని తెలిపారు. ఆయన వెంట వచ్చిన అనుచరులు 16, 17వ తేదీల్లో వేసిన నామినేషన్లను దౌర్జన్యంగా చించి వేశారని ఆరోపించారు. వారి చర్యలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి జరిగిన దాంట్లో పోలీసుల పాత్రపై అనుమానం వస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ ఇస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసి గెలిపించే సంప్రదాయం మంచిదా? అధికార బలంతో గెలవడం మంచిదా ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమన్నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేపీ లింగన్న, మాజీ వైస్ చైర్మన్ మహబూబ్ షరీఫ్, భరత్ కుమార్‌రెడ్డి, జ్వాలా నరసింహశర్మ, కరిడి రమణమూర్తి, జకరయ్య తదితరులు పాల్గొన్నారు.


