ఎర్రగుంట్ల మున్సిపల్‌ ఎన్నిక రద్దు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎర్రగుంట్ల మున్సిపల్‌ ఎన్నిక రద్దు చేయండి

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

● ఎమ్మెల్యే ఆది, భూపేష్‌రెడ్డిపై

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజం

● ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఓటింగ్‌కు రావాలని సవాల్‌

ఎర్రగుంట్ల : వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌లు వేయనీయకుండా అడ్డుకుని.. గెలుపు అని చెప్పుకొంటున్న ఈ మున్సిపల్‌ ఎన్నికను రద్దు చేయాలని ఎమ్మెల్సీ, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి పి.రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో దాడికి గురైన పార్టీ మహిళా అభ్యర్థులతోపాటు నాయకులతో కలిసి.. ఎర్రగుంట్లలోని పార్టీ నాయకుడు తుంగ వెంకటరామిరెడ్డి ఇంటిలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలకు ధైర్యం ఉంటే ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించి ప్రజాక్షేత్రంలో ఓటింగ్‌కు రావాలని సవాల్‌ విసిరారు. నామినేషన్‌లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులను అడ్డుకుని దాడి చేసి, మహిళలు అని కూడా చూడకుండా వారి వస్త్రాలు లాగి, చెప్పులు, కర్రలతో దాడి చేయడం నీచాతినీచమన్నారు. గుర్తు పెట్టుకోండి తమ పార్టీ నాయకులపై దాడి చేసిన ఏ ఒక్కర్ని వదలబోమని, 2029లో మీకు అంతకు అంత డబుల్‌గా గుణపాఠం చెబుతామన్నారు. అప్పుడు మిమ్మల్ని బాబాయ్‌, అబ్బాయ్‌లు ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. ప్రతి సారి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెబుతుంటారని, మహిళలపై దాడి చేయడమే మీ డబుల్‌ ఇంజన్‌ అని అన్నారు. 2029లో మీకు డబుల్‌ చార్చ్‌ చూపిస్తామన్నారు. ఫ్యాషన్‌ ముసుగులో ఎర్రగుంట్లలో ఫ్యాక్షన్‌ పెంపొందిస్తున్నావని ధ్వజమెత్తారు. ఎర్రగుంట్లలో జరిగిన దాడి సంఘటనలన్నింటిని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఎస్‌ఈసీలకు అన్ని ఆధారాలతో పంపించామన్నారు. వెంటనే ఎర్రగుంట్ల ఎన్నికను రద్దు చేసి, మళ్లీ కొత్త నోటిఫికేషన్‌తో నామినేషన్‌లు జరిపి కేంద్ర బలగాలు దించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement